POKకు ప్రధాని కావాలని ఉంది: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలనం
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) పై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే కు ప్రధాని కావాలని ఉంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనను పీఓకే ప్రధానిగా నియమించాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను అడుగుతానని అన్నారు. కానీ రాజ్యాంగం అందుకు అడ్డుగా వస్తోందని తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో నవాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ మేరకు అక్కడి ప్రజల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
" ఈ ఎన్నికల్లో ఒకవేళ మా పార్టీ గెలిస్తే నన్ను పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు ప్రధానిని చేయమని నా సోదరుడు షెహబాజ్ షరీఫ్ ను అడుగుతా. నేను ఆజాద్ కాశ్మీర్ ప్రాంతానికి ప్రధాని అయితే ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది" అని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. అంతేకాక పీఓకే తనకు రెండో ఇళ్లు లాంటిదని పేర్కొన్నారు. తమ పూర్వికులు ఈ ప్రాంతం నుంచే వచ్చారని తెలిపారు. అయితే నవాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యల్ని సరదాకు అన్నారా..? లేక ఏదైనా ఉద్దేశంతో అన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే పాకిస్థాన్ రాజ్యాంగంలో ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలకు ప్రధానులు ఉండరు.. అని పలువురు చెబుతున్నారు.
రాజ్యాంగం ప్రకారం.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన స్థానిక ఓటర్ మాత్రమే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం, ప్రధానిగా ఎన్నుకోవడం ఉంటుంది. నవాజ్ షరీఫ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. దాంతో ఆయన పీఓకే ప్రాంతానికి ప్రధాని అవ్వడానికి అనర్హులు. ఇక ఇదే ఎన్నికల ర్యాలీలో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ తరఫున పాల్గొన్న నవాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయినా ఇక్కడి ప్రజలతో తాను సంబంధాలు తెంచుకోనని.. ప్రతి మూడు నెలలకోసారి ఈ ప్రాంతానికి వచ్చి సమస్యలను వింటానని స్పష్టం చేశారు.

ఇక పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో జూలై 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. గత కొద్ది వారాలుగా పాకిస్థాన్ ప్రభుత్వ నిర్బంధ చర్యలు, ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు పీఓకేలో జరుగుతున్న ఈ పరిణామాలపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఎన్నికలు చెల్లవని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్ లో విడదీయరాని అంతర్భాగాలని స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల్లో నిర్వహించే ఈ ఎన్నికలను భారత్ గుర్తించదని పేర్కొంది.












Click it and Unblock the Notifications