Nepal Floods: నేపాల్ లో 1,344 కు చేరిన మృతుల సంఖ్య.. ఇంకా 5 వేల మంది ఆచూకీ గల్లంతు..
నేపాల్ లో వరద బీభత్సానికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం నాటికి మృతుల సంఖ్య 1,344 మందికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. శిథిలాలు, మట్టి దిబ్బలు తవ్వుతున్న కొద్దీ మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇంకా 5 వేల మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. దాంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు నేపాల్ పోలీసులు వివరించారు. వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఇక వరదల కారణంగా పట్టణాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు పూర్తిగా స్తంభించాయి. రోడ్లు, బ్రిడ్జ్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక రవాణా మార్గం పూర్తిగా స్తంభించింది. వాతావరణం అనుకూలంగా లేకపోయినా పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు గంట గంటకూ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ వరదల్లో 18 కు పైగా పాఠశాలలు పూర్తిగా నేలమట్టం అయినట్లు సమాచారం. 250 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ జన జీవనం, రవాణా, టెలిఫోన్ వ్యవస్థలు స్తంభించి పోవడంతో గల్లంతైన వారిని గుర్తించడం సవాల్ గా మారింది.

కొద్దిసేపటి క్రితం వరదల ధాటికి గల్లంతైన ఇద్దరిని సజీవంగా బయటకు తీశారు నేపాల్ పోలీసులు. విపత్తు సంభవించి 11 రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వారు సజీవంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారింది. గల్లంతైన వారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు, అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక నేపాల్ సైన్యం సుమారు 20 హెలికాప్టర్లను సహాయక చర్యలకు వినియోగిస్తోంది. నువాకోట్, రుసువా జిల్లాల్లో గాలింపు, రక్షణ, సహాయక సామగ్రి పంపిణీ నిరంతరం కొనసాగుతోంది. ఇదిలాఉంటే నేపాల్ ను మరో ముప్పు వెంటాడుతోంది. తాజాగా మరోసారి అక్కడి ప్రజలకు వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భారీ వర్షాల కారణంగా దార్చులా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి చౌలానీ నది ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. కొండలపై నుంచి జారిపడిన రాళ్లు, మట్టితో నదీ ప్రవాహం పాక్షికంగా నిలిచిపోయింది. అయితే రాళ్లు తొలిగిపోతే లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు ఉందని అధికారులు వారిని అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications