గద్దెనెక్కిన 24 గంటల్లోనే జైలుకు మాజీ ప్రధాని!
నేపాల్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆ దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ భారీ కుదుపు చోటుచేసుకుంది. యువ నాయకుడు బాలెంద్ర షా(బాలెన్ షా) నేతృత్వంలోని నూతన సర్కారు బాధ్యతలు చేపట్టిన కేవలం 24 గంటల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ అగ్రనేత కేపీ శర్మ ఓలీని శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామం నేపాల్‌లోనే కాకుండా దక్షిణాసియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అరెస్ట్‌కు దారితీసిన జెన్-జీ నిరసనల నేపథ్యం
గతేడాది సెప్టెంబర్‌లో నేపాల్‌లో వ్యవస్థాగత మార్పుల కోసం, అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఈ నిరసనలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంది. ఆ సమయంలో జరిగిన పోలీసు కాల్పులు, ఘర్షణల్లో సుమారు 77 మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ జరిపిన గౌరీ బహదూర్ కార్కీ కమిషన్..అప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హింసకు పాల్పడిందని.. నిరాయుధులైన విద్యార్థులపై కాల్పులకు ఆదేశాలిచ్చిందని తన నివేదికలో స్పష్టం చేసింది.

తొలి కేబినెట్ భేటీలోనే కఠిన నిర్ణయం
ఇటీవల ఎన్నికల్లో బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బాలెన్ షా తన మొదటి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా కార్కీ కమిషన్ నివేదికను యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే పోలీసులు రంగంలోకి దిగి భక్తాపూర్‌లోని నివాసంలో ఉన్న కేపీ శర్మ ఓలీని.. అలాగే మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో జవాబుదారీతనం లేని నాయకులకు ఇది ఓ హెచ్చరిక అని కొత్త ప్రభుత్వం ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది.
బాలెన్ షా ప్రభంజనం
ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ వంటి హేమాహేమీలను ఓడించి 35 ఏళ్ల బాలెన్ షా ప్రధాని పీఠాన్ని అధిరోహించడం నేపాల్ రాజకీయాల్లో ఓ నవశకానికి నాందిగా భావిస్తున్నారు. వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్, పాపులర్ రాపర్ అయిన బాలెన్.. ఖాట్మండు మేయర్‌గా తన పనితీరుతో ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ 275 సీట్లకు గానూ 182 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా కేపీ శర్మ ఓలీ సొంత గడ్డ అయిన ఝాపా-5 నియోజకవర్గంలోనే ఓలీని 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించి బాలెన్ షా చరిత్ర సృష్టించారు.
నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి
మాజీ ప్రధాని అరెస్టుతో నేపాల్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేపీ శర్మ ఓలీ మద్దతుదారులు, పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం ఉండడంతో ఖాట్మండు లోయలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారుల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పాత తరం రాజకీయ నాయకుల అవినీతి, నియంతృత్వ పోకడలకు స్వస్తి పలికి.. పారదర్శకమైన పాలన అందిస్తానని బాలెన్ షా ఇస్తున్న హామీలపై అక్కడి యువత ఎంతో ఆశతో ఉంది.












Click it and Unblock the Notifications