శ్రీరాముడు జన్మించింది భారత్‌లో కాదు.. మా దేశంలోనే !
శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాట్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించాడని వ్యాఖ్యానించారు. దీంతో ఓలి కామెంట్స్ పట్ల తీవ్ర దుమారం రేగుతోంది. భారతదేశంలోని పలువురు ప్రముఖులు సైతం నేపాల్ ప్రధాని మాటలను వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారం అయోధ్య రాముడి అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.
ఓలి ఏమన్నారంటే..?
రాముడు పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉందని ఓలి పేర్కొన్నారు. అది ఇప్పటికీ ఇక్కడే ఉంది. దీన్ని మేం అంతగా ప్రచారం చేయలేకపోతున్నాం. ఇది కొందరిని బాధిస్తుందని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని.. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే చెబుతున్నానని చెప్పుకొచ్చారు.

కాగా గతంలో కూడా ఓలి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేశారు. అయోధ్య తమ దేశంలోని చిత్వాన్‌లోని థోరిలో ఉందని ఆయన గతంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో భారత్-నేపాల్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
మరోవైపు భారతదేశంలో శ్రీరాముడి జన్మస్థలంగా అయోధ్యను వేల సంవత్సరాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇటీవలే భారీ ఎత్తున రామమందిరం నిర్మాణం కూడా పూర్తయ్యి.. హిందువులకు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ పరిస్థితుల్లో నేపాల్ ప్రధాని ఓలి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చరిత్రకారులు, మత పెద్దలు, రాజకీయ విశ్లేషకుల మధ్య కొత్త చర్చకు దారితీస్తుంది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications