Nimisha Priya Case: "వెంటనే ఉరి తీయండి".. కేరళ నర్సు ఆశలు ఆవిరి!
Nimisha Priya Case: యెమెన్‌లో తలాల్ అబ్దు మెహదీ అనే పౌరుడి హత్య కేసులో దోషిగా తేలిన భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష నుంచి తప్పించుకునే ఆశలు దాదాపుగా అడుగంటాయి. కేరళకు చెందిన నర్సుకు ఉరిశిక్ష నుంచి బయటపడే ఆశలు క్రమంగా సన్నిగిల్లుతున్నాయి. యెమెన్‌లో హత్య కేసులో ఆమెకు ఇప్పటికే మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జులై 16, 2025న ఆమెను ఉరి తీయాలని మొదట నిర్ణయించారు. అయితే యెమెన్ అధికారులు ప్రస్తుతం ఆ ఉరిశిక్షను అనిశ్చిత కాలానికి వాయిదా వేశారు.
ఈ క్రమంలో ఈ కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. నిమిషా ప్రికు తక్షణమే మరణశిక్ష అమలు చేయాలని మృతుడి కుటుంబం కోర్టును కోరడంతో ఆమె భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మృతుడు తలాల్ అబ్దు మెహదీ సోదరుడు అబ్దుల్ ఫత్తా అబ్దు మెహదీ యెమెన్ అటార్నీ జనరల్ జడ్జి అబ్దుల్ సలాం అల్ హౌతీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో, నిమిషా ప్రియకు తక్షణమే మరణశిక్షను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుడి సోదరుడు ఫత్తాహ్ తన లేఖలో కుటుంబం నిమిషా ప్రియను క్షమించడానికి నిరాకరించిందని, వారు ఎటువంటి బ్లడ్ మనీ (నష్టపరిహారం) స్వీకరించలేదని తెలిసింది. "ఖిసాస్" అంటే ప్రతీకారం తీర్చుకోవాలని తమ లేఖలో ఆయన డిమాండ్ చేశారు.

నిమిష ప్రియ కేసు పూర్తి వివరాలు
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన నిమిషా ప్రియ 2008లో యెమెన్‌కు వెళ్లి సనాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. మెరుగైన సంపాదన కోసం ఆమె మృతుడు తలాల్‌తో కలిసి ఒక క్లినిక్‌ను ప్రారంభించింది. నిమిష ప్రియ తరపు న్యాయవాది వాదనల ప్రకారం, తలాల్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడని, ఆమె పాస్‌పోర్ట్‌ను కూడా లాక్కున్నాడని పేర్కొన్నారు. అతని బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో, నిమిషా తలాల్‌కు మత్తు మందు ఇచ్చింది, అది అతని మరణానికి దారితీసింది. ఆ తర్వాత తలాల్ ఛిద్రమైన మృతదేహం ఒక నీటి ట్యాంక్‌లో లభ్యమైంది.
భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు
ఈ కేసులో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిమిష ప్రియకు మద్దతుగా అన్ని విధాలా సహాయం చేయడానికి ప్రయత్నించింది. అయితే యెమెన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అస్థిరమైన భద్రతా పరిస్థితుల కారణంగా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ప్రతినిధులకు అక్కడికి వెళ్లడానికి అనుమతి లభించలేదు. భారత ప్రభుత్వం, సామాజిక కార్యకర్తలు తలాల్ కుటుంబంతో క్షమాపణలు కోరి, బ్లడ్ మనీ చెల్లించడానికి ప్రయత్నించారు. కానీ, మృతుడి కుటుంబం దానిని పూర్తిగా తిరస్కరించింది. యెమెన్ షరియా చట్టం ప్రకారం, మృతుడి కుటుంబం క్షమించినట్లయితే మాత్రమే ఉరిశిక్షను ఆపవచ్చు. అయితే, ఇప్పుడు ఆ మార్గం కూడా మూసుకుపోయింది. దీంతో నిమిషా ప్రియకు మిగిలిన ఆశలు దాదాపుగా మసకబారాయి.












Click it and Unblock the Notifications