30లక్షల మంది సిద్దం: అమెరికాతో యుద్దం దిశగా ఉ.కొరియా, హైటెన్షన్?
యుద్దం దిశగానే ఉత్తరకొరియా సన్నాహకాల్లో నిమగ్నమైనట్లు ఆ దేశ మీడియా వెల్లడించడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
ప్యోంగ్‌యాంగ్: అమెరికా-ఉత్తరకొరియాల మధ్య పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. యుద్దం దిశగానే ఉత్తరకొరియా సన్నాహకాల్లో నిమగ్నమైనట్లు ఆ దేశ మీడియా వెల్లడించడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. అమెరికాతో యుద్దం కోసం ఇప్పటికే 30 లక్షల మంది ఉత్తరకొరియన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అక్కడి మీడియా వెల్లడించడం ఆ దేశ వైఖరిని స్పష్టం చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. మరో క్షిపణి ప్రయోగానికి సిద్దమైనట్లు అక్కడి టీవీ చానెల్ వెల్లడించింది. ఇప్పటివరకు ఖండాంతర క్షిపణుల ప్రయోగాలు చేపట్టిన కిమ్.. ఇకనుంచి జలాంతర్గామి ఆధారిత బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలపడం గమనార్హం.

ఇప్పటివరకు 11క్షిపణి ప్రయోగాలను చేపట్టిన ఉత్తరకొరియా.. గత జులై నెలలోనే 3క్షిపణి ప్రయోగాలు చేపట్టడం గమనార్హం. ఆఖరికి అమెరికా స్వాతంత్ర్య దినమైన జులై 4న మరోసారి బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) ప్రయోగం జరిపి ఉత్తరకొరియా తన దుందుడుకు వైఖరిని మరింత స్పష్టం చేసింది.
పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా ఆధీనంలో ఉన్న గువాం ద్వీపంపై అణుదాడి చేస్తామంటూ ఉత్తరకొరియా ప్రకటించడంతో.. తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అలా చేస్తే.. ఉత్తరకొరియాను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని ట్రంప్ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాపై కక్ష సాధింపు చర్యలకు ఉత్తరకొరియా అంతర్గతంగా తమ సన్నాహాకాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications