వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ
PM Modi US visit 2024: తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ఐరాస 79వ సర్వసభ్య సమావేశం ఇది. సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అనే థీమ్‌పై ఈ భేటీ ఏర్పాటైంది. యుద్ధ రహిత సమాజం, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ డిజిటల్ గవర్నెన్స్ సహా పలు అంశాలు ప్రస్తావించారు.
ప్రపంచ దేశాలు సుస్థిర అభివృద్ధి చెందడంతో పాటు శాంతిని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దీనికోసం ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయంలో కీలక పాత్రను పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక వంతెనగా ఉండాలే తప్ప అభివృద్ధికి అడ్డంకి కాకూడదని వ్యాఖ్యానించారు. మానవత్వం అనేది మానవాళి ఐక్యతలో ఉందే తప్ప యుద్ధభూమిలో కాదని హితవు పలికారు.
న్యూ ఢిల్లీ సమ్మిట్‌లో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా పరిణమిస్తూనే ఉందని, అదే సమయంలో సైబర్, సముద్ర, అంతరిక్షం వంటి రంగాలు కొత్త సంఘర్షణ వేదికలుగా రూపుదిద్దుకుంటోన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ మానవాళికి సంక్షేమం, ఆహార- ఆరోగ్య భద్రత కల్పించినప్పుడే సుస్థిరాభివృద్ధిని సాధించడం సాధ్యపడుతుందని, ఇదే విధానాన్ని తాము అవలంభిస్తోన్నామని మోదీ తెలిపారు. ఈ విధానాల వల్ల 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, సుస్థిరాభివృద్ధికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు.. అనే ప్రాథమిక సూత్రాలు తమ దేశానికి మూలస్తంభాల వంటివని మోదీ చెప్పారు. ప్రపంచ శ్రేయస్సు కోసం తమ ఆలోచనలను పంచుకోవడానికి తాము అంకితభావంతో పని చేస్తామనీ మోదీ స్పష్టం చేశారు.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలు వరుసగా మూడోసారి తనను ఎన్నుకొన్నారని, వారికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారని మోదీ గుర్తు చేశారు. ప్రపంచ భవిష్యత్తు జరిగే చర్చలన్నీ కూడా మానవాళి సంక్షేమం కేంద్రీకృతంగా సాగాల్సిన అవసరం ఉందని అప్పుడే సమ్మిళిత అభివృద్ధిని సాధించగలమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications