• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కున్న అతి పెద్ద సమస్యేంటి? బిన్‌లాడెన్‌ గురించి నోరు జారారా, కావాలనే మాట్లాడారా?

By BBC News తెలుగు
|

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్‌ఖాన్ అతి పెద్ద సమస్యేంటి? ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేకపోవడమేనా? ఏమాత్రం అనుభవం లేని మంత్రివర్గమా ? తనకు తోచినట్టు చేసేయడమా లేక ఎవరి అభిప్రాయమూ పట్టించుకోకపోవడమా? ఇవేవీ ఆయన సమస్యలు కాదని నా అభిప్రాయం. రాసిన ప్రసంగాలను చదవకూడదు అనుకోవడమే ఆయనకున్న అతి పెద్ద సమస్య.

పార్లమెంటులో ఆయన ముఖ్యమైన విషయంపై మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చారిత్రక తప్పిదం చేసినా, అనాలోచితంగా మాట్లాడినా మీడియా దాన్ని పట్టేసుకుంటుంది. గురువారం నాడు పార్లమెంటులో ఇమ్రన్‌ఖాన్‌ చేసిన 1 గంటా 13 నిమిషాల ప్రసంగంలో సరిగ్గా ఇదే జరిగింది.

కరోనావైరస్, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానంలాంటి పెద్దపెద్ద సమస్యలపై పార్లమెంటుకు తన వైఖరిని వివరించడానికి ఆయన ప్రయత్నించారు. కానీ మీడియా మొత్తం ఒసామా బిన్‌ లాడెన్‌ అమరవీరుడన్న మాటలను మాత్రమే పట్టుకుంది. అది చివరకు 'ఇమ్రాన్‌ బిన్‌ లాడెన్' అంటూ ట్విటర్‌లో ట్రెండింగ్‌ అయ్యింది. ఆయన అప్పటికే 'తాలిబన్ ఖాన్' అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏకంగా బిన్‌ లాడెన్‌నే పొగిడారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ప్రధాని కార్యాలయం నుంచి దీనిపై ఎలాంటి ఖండనా వెలువడలేదు.

అయితే ఒసామా బిన్‌ లాడెన్‌ గురించి మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి రెండుసార్లు హత్య అనే పదం ఉపయోగించారని ప్రధాని ప్రత్యేక సహాయకుడు డాక్టర్ షాబాజ్ గుల్ ఒక ట్వీట్‌ చేశారు. అయితే ఇది వారివైపు నుంచి వచ్చిన వివరణా లేక మరింత గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నమా అన్నది ఎవరికీ అర్ధం కాలేదు.

https://twitter.com/SHABAZGIL/status/1276214755070337024

ప్రధానమంత్రి తన మాటను సమర్ధించుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ముస్లిం లీగ్‌(నవాజ్‌) వ్యాఖ్యానించింది. ఇమ్రాన్‌ఖాన్‌ మంత్రి వర్గంలో సైన్స్‌ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్‌ చౌధరి ప్రధానమంత్రి నోరు జారారని చెప్పి ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించారు.

అధికార పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ లోపల వర్గ విభేదాలున్నాయని ప్రకటించి ఫవాద్‌ చౌధరి ప్రధానమంత్రి ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి ఫవాద్‌ చౌధరి మాటలను నమ్మడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా లేవు.

ఒసామా బిన్ లాడెన్

ఇక పార్లమెంటులో ఇమ్రాన్‌ ఖాన్ పక్కనే కూర్చున్న విదేశాంగ మంత్రి షామెహమూద్ ఖురేషి తరువాత జర్నలిస్టులతో మాట్లాడినా, దీనిపై ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

ఇమ్రాన్‌ఖాన్‌ భావోద్వేగాలున్న వ్యక్తని, ఆయన ఒకసారి మాట అంటే వెనక్కి తీసుకోరని ఆయన సన్నిహితులు చెబుతారు.

జరిగిందేదో జరిగిపోయిందని, దీన్ని వదిలేయాలన్నది ఇమ్రాన్‌ఖాన్‌ వర్గం వైఖరిగా కనిపిస్తోంది. అయితే తాలిబన్‌ ఖాన్‌లాగా ఇది ఆయన్ను ఇంతటితో వదిలేయదని ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.

https://twitter.com/PTISindhOffice/status/1276139234898907136

తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధికారంలోకి రాక ముందు కూడా ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్‌పై అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించేవారు. పాకిస్తాన్‌లో అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు.

వజీరిస్థాన్‌లోని గిరిజన ప్రాంతాలలో ప్రదర్శనలను నిర్వహించి సంతకాల సేకరణ కూడా చేశారు. డ్రోన్‌ దాడులు ఐక్యరాజ్యసమితి మ్యానిఫెస్టో ఉల్లంఘనేనని, ప్రపంచంలోని నంబర్ వన్ ఉగ్రవాది అయినా, తన కుటుంబ సభ్యులతో సహా ఎవరినీ అనుమానంతో చంపడానికి చట్టం అనుమతించదని ఆయన అనేవారు.

ఈ కారణంగా, ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మనసులో మంచివాడిగా మారిపోయారు. ఆయన కూడా వారినెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.

కానీ పాకిస్తాన్ పౌరసమాజం, ఉదారవాద పార్టీలు ఆయనతో ఏకీభవించ లేదు.

ఇమ్రాన్‌ఖాన్ తాలిబన్‌ల గూఢాచారని మానవ హక్కుల కార్యకర్త అసం జహంగీర్ విమర్శించేవారు. ఆర్మీ ఒత్తిడి కారణంగానే ఇమ్రాన్‌ఖాన్‌ డ్రోన్‌ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించారని ఆయన సొంత పార్టీకే చెందిన మాజీ నేత జావేద్‌ హష్మి సంచలన ఆరోపణలు చేశారు.

"ఓసారి కరాచీలో ఆయనతో కలిసి కారులో వెళుతుండగా పాషాసాహబ్ (పాకిస్థాన్‌ ఐఎస్ఐకి అధిపతి) తనతో మాట్లాడినట్లు ఇమ్రాన్‌ఖాన్ నాతో చెప్పారు" అని జావేద్‌ హష్మీ వెల్లడించారు.

జనరల్ పర్వేజ్ ముషారఫ్

అఫ్ఘానిస్తాన్‌లో బలప్రయోగంకన్నా రాజకీయ పరిష్కారం గురించి ఇమ్రాన్‌ఖాన్‌ ఎప్పుడూ మాట్లాడేవారు. అమెరికా, అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల మధ్య దోహా ఒప్పందానికి తానే కారణమని ఆయన చెప్పుకుంటారు. గతంలో అమెరికా, తాలిబన్లు ఇద్దరూ చర్చలకు సుముఖంగా ఉండేవారు కాదు.

ఇమ్రాన్‌ఖాన్ ఒక వామపక్ష భావాలున్న రాజకీయ నాయకుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని కేథడ్రల్ స్కూల్, లాహోర్‌ లిబరల్ ఎచిసన్ కాలేజీలోని రాయల్ గ్రామర్ స్కూల్, తరువాత ఆక్స్ ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకున్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌ యవ్వనంలో ఉన్నప్పటి అనేక వివరాలను 'ఇమ్రాన్ ఖాన్: ది క్రికెటర్, ది సెలబ్రేషన్, ది పొలిటీషియన్' పుస్తకం రచయిత క్రిస్టోఫర్ శాండ్‌ఫోర్డ్ తన పుస్తకంలో రాశారు. అయితే 41వ సంవత్సరం నుంచి ఆయన తన 'ప్లే బాయ్' ఇమేజ్‌ని నెమ్మదిగా తగ్గించడం మొదలుపెట్టారని ఆయన చెబుతారు.

ఇమ్రాన్‌ మియా బషీర్ అనే ఆధ్యాత్మిక గురువును కలిశారు. రాజకీయ రంగంలో ఆయన మాజీ ఐఎస్ఐ నాయకులు, జనరల్‌ హమీద్ గుల్, మహ్మద్ అలీ దుర్రానీలతో చేతులు కలిపారు.

ఇంకో విశేషం ఏంటంటే, 'తాలిబన్ పోషకుడు' మౌలానా సమీ ఉల్-హక్‌ ఇమ్రాన్‌ పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ సన్నిహితంగా ఉంటారు. ఆయన ఏకంగా ఒక మదర్సాకు ప్రభుత్వ నుంచి సహాయం పొందగలిగారు. ఇది ప్రపంచానికి 'జిహాద్ విశ్వవిద్యాలయం'గా విమర్శలు ఎదుర్కొంది.

జనరల్ పర్వేజ్ ముషారఫ్ నుంచి కూడా ఇమ్రాన్‌కు మద్దతు ఉంది. కార్యకర్తలలో ఎక్కువమంది చదువుకున్న వారు ఉండటంతో పీటీఐకి లిబరల్ పార్టీగా ముద్ర ఉంది. కాని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పార్టీ నాయకత్వం మాత్రం పూర్తి సంప్రదాయకంగా ఉంటుంది.

తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ కార్యకర్తలకు భావజాలంలో మతోన్మాదం లేదు. ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తల మాదిరిగా రాజకీయ శిక్షణ కూడా లేదు.

2013లో ఎన్నికల ప్రచారం సందర్భంగా బీబీసీ ఉర్దూలో ఓ కార్యక్రమం కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆహ్వానించించారు. ప్రజల నుంచి ప్రశ్నలను ఆహ్వానిస్తూ ఓ 30 సెకన్ల చిన్న ప్రోమో కోసం స్క్రిప్ట్‌ పంపినప్పుడు ఆయన దాన్ని చదవడానికి నిరాకరించారు. మూడు నిమిషాల సందేశాన్ని ఆయన స్వయంగా రికార్డ్ చేశారు. కానీ దీన్ని ఎడిట్‌ చేయడం సాధ్యం కాలేదు. దీనినిబట్టి ఆయనకు రాసినవి చదవడంలో ఇబ్బంది ఉందనో లేక ఆయన దానికి వ్యతిరేకమనో భావించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pak PM Imran Khan slips his tongue over Binladen,Was it intentional
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X