అమెరికాతో గొడవలోకి భారత్‌ను లాగిన పాకిస్తాన్, డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు
కరాచీ: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ భాషలో మాట్లాడుతున్నారని పాకిస్తాన్ మండిపడింది. తద్వారా అమెరికా, పాకిస్థాన్‌ల గొడవ మధ్యలోకి దాయాది మన దేశాన్ని కూడా లాగింది.
ట్రంప్ పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, ఫండ్స్ విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడారు. ట్రంప్ ఉగ్రవాదుల విషయంలో భారత్ భాషలో మాట్లాడుతున్నారన్నారు. పాకిస్తాన్, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖ్వాజా దేశ భద్రతపై పార్లమెంటరీ కమిటీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అఫ్గానిస్థాన్‌లో అమెరికా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ కూడా భారత్ భాషలో మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.
భారత్, అమెరికాల మధ్య ఉన్న సంబంధాల వల్ల అమెరికా ఆ దేశ భాష మాట్లాడుతోందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై సరైన చర్యలు తీసుకోకుండా, తమను గత కొన్నేళ్లుగా మోసం చేస్తోందని ట్రంప్ పాక్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పాక్‌కు 255మిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని, తాజాగా 900 మిలియన్ డాలర్ల భద్రతా సహకారాన్ని నిలిపేశారు.












Click it and Unblock the Notifications