పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు: ఆత్మాహూతి దళాల దాడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశ వైమానిక దళానికి చెందిన మియావాలి ఎయిర్ బేస్ స్టేషన్ (Mianwali air base station) పై ఆత్మాహూతి దళాలు విరుచుకుపడ్డాయి. యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాయి. కొన్ని గంటలుగా ఉగ్రవాదులు, భద్రత సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఎంతమంది మరణించారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ ఘటనతో పాకిస్తాన్ (Pakistan) ఉలిక్కిపడింది. అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున భద్రత సిబ్బంది, సాయుధ బలగాలను తరలించింది.

పాకిస్తాన్ ఉత్తరప్రాంతంలో ఉంటుంది ఈ మియావాలీ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్. భౌగోళికపరంగా అత్యంత కీలకమైనది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉండే ఈ ప్రాంతం.. ఉత్తర పాకిస్తాన్ వైమానిక దళం ప్రధాన కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలు ఇక్కడే అధికం.
అలాంటి ప్రాంతంపై ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆత్మాహూతి దళ సభ్యులు మారణ హోమాన్ని సృష్టించారు. మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని వైమానిక దళాధికారులు భావిస్తోన్నారు. ఎదురుకాల్పుల సందర్భంగా ముగ్గురిని హతమార్చినట్లు తెలిపారు.
తెహ్రీక్-ఇ- జిహాద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లతో ఈ సంస్థకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. తాలిబన్లకు అనుబంధంగా ఇది కొనసాగుతోంది. పాకిస్తాన్ ఉత్తరప్రాంతంలో తరచూ ఈ సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతుంటుందని స్థానిక మీడియా తెలిపింది.
కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే మియావాలీ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్‌లోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారనే విషయంపై ప్రభుత్వం ఆరా తీసతోంది. గోడను ఎక్కడానికి, ఫెన్సింగ్‌ను దాటడానికి ఉగ్రవాదులు నిచ్చెనను వినియోగించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోన్నామని ఎయిర్ ఫోర్స్ తెలిపింది.












Click it and Unblock the Notifications