ఉగ్రవాదుల భీకర దాడి- పోలీస్ కమిషనర్ కార్యాలయంపై: ఎదురుకాల్పులతో అట్టుడుకుతున్న సిటీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు భీకర దాడికి దిగారు. పోర్ట్ సిటీ కరాచీ నగర పోలీస్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, జాతీయ భద్రత అధికారులు సంఘటన స్థలానికి చేరకున్నారు. ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రేంజర్ పర్సనల్ ఆఫీసర్, పోలీస్ అధికారి సహా ముగ్గురు గాయపడ్డారు.
ఈ ఉగ్రవాద దాడికి పాల్పడింది తాలిబన్లుగా అనుమానిస్తోన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్లు, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు-ప్రత్యారోపణలను చేసుకుంటోన్నారు. తమదేశంలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) కారణమని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్నారంటూ కొద్దిరోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వం బాహటంగా ప్రకటనలు చేస్తోంది.

దీన్ని తాలిబన్ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. ఈ పరిణామాల మధ్య తాజాగా కరాచీ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడి వెనుక తాలిబన్లే ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా ఈ దాడికి పాల్పడింది.

కాగా- మిలిటెంట్లు కరాచీ పోలీస్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారనే సమాచారం అందిన వెంటనే భద్రత అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు మిలిటెంట్లు మరణించినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఈ ఘటన అనంతరం సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా- కరాచీలో రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. టీటీపీకి చెందిన ఉగ్రవాదులు మరింత మంది ఉండొచ్చనే కారణంతో గాలింపు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

మిలిటెంట్లు చొరబడిన సమయంలో కరాచీ పోలీస్ ఆఫీస్ కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉన్నారనేది తెలియరావట్లేదు. ప్రస్తుతం సంఘటన స్థలంలో 30 మంది పోలీసులు, మరో 25 మంది భద్రత సిబ్బందిని మోహరింపజేసినట్లు సింధ్ ప్రావిన్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇర్ఫాన్ బలోచ్ తెలిపారు.












Click it and Unblock the Notifications