ఆ విషయంలో భారత్ కంటే మేమే తోపు: మరోసారి రెచ్చగొట్టిన పాకిస్థాన్..
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లోయలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే తాజాగా భారత్- పాకిస్థాన్ వ్యవహారంపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణను రెండు వేర్వేరు భావజాలాల మధ్య జరిగిన యుద్ధం అని అభివర్ణించారు. ఈ మేరకు రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. గతేడాది మే 7 నుంచి 10 మధ్య భారత్ తో జరిగిన నాలుగు రోజుల ఘర్షణకు పాకిస్థాన్.. మార్కా ఏ హక్ అని పేరు పెట్టిందని అసిమ్ మునీర్ పేర్కొన్నారు. ఈ పోరాటంలో భారత్ కంటే పాకిస్థాన్ వ్యూహం ఎంతో మెరుగైనదని మునీర్ స్పష్టం చేశారు.
గతేడాది మే 7 నుంచి 10 వరకు జరిగిన యుద్దాన్ని భారత్ ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించగా.. పాకిస్థాన్ మార్కా ఏ హక్ అని పేరు పెట్టింది. అయితే ఈ ఘటన జరిగి ఈరోజుకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను భారత్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అయితే భారత్ తో జరిగిన ఘర్షణలో పాకిస్థాన్ పూర్తి ఐక్యతతో సైనిక సామర్థ్యంలో జవాబిచ్చిందని తెలిపారు.
మార్కా ఏ హక్ అంటే కేవలం రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం మాత్రమే కాదని ఇది రెండు భిన్న భావజాలాల మధ్య జరిగిన నిర్ణయాత్మక పోరాటం అని ఆయన అన్నారు. ఈ ఘర్షణలో పాకిస్థాన్ 26 లక్ష్యాలను తాకినట్లు మునీర్ చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలను చూపించలేదు. అంతేకాక అమెరికా ద్వారా భారత్ కాల్పుల విరమణ కోరిందని అయితే శాంతి ప్రయోజనాల దృష్ట్యా తాము అందుకు అంగీకరించినట్లు ఆరోపించారు.

రాబోయే కాలంలో యుద్ధాలు భిన్నంగా ఉంటాయని అసిమ్ మునీర్ అన్నారు. సాంకేతికత, శిక్షణ ద్వారా పాకిస్థాన్ అలాంటి ఘర్షణలకు సిద్ధం అవుతూందని ఆయన తెలిపారు. హంగోర్- క్లాస్ సబ్ మెరైన్లు, కొత్త రాకెట్ ఫోర్స్, యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా తమ సైనిక శక్తిని ఆధునీకరిస్తున్నట్లు అసిమ్ మునీర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications