హిందువులతో పోలిస్తే మనం భిన్నం.. కాశ్మీర్ ను మర్చిపోమంటున్న పాక్ ఆర్మీ చీఫ్
దుష్ప్రచారమే జీవనాడిగా చేసుకున్న పాకిస్థాన్.. మరోమారు విషాన్ని వెళ్లగక్కింది. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే ఎన్నోసార్లు నిందలు ఎదురైనా కానీ దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం తన పాత రాగాలనే మళ్లీ పాడుతూ ఉంది. భారత్‌ను కాశ్మీర్ పేరుతో నిందించడం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నం చేయడం పరిపాటిగా మారిన తరుణంలో.. తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించారు.
కాశ్మీర్ తమ జీవనాడి అని.. ఆ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని ఆర్మీ చీఫ్ అసిమ్ పునరుద్ఘాటించారు. కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ ప్రసంగించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులు దేశ రాయబారులు అంటూ తెలిపారు. వారంతా ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. విదేశాల్లో ఉన్న పాకిస్థానీయులకు భారత్‌తో తమ భిన్నతలను గుర్తు చేస్తూ, హిందువులతో తమకు సంబంధం లేదని.. తమ సంస్కృతి, సంప్రదాయాలు హిందువులతో భిన్నం అంటూ వ్యాఖ్యానించారు.
అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని.. ఈ దేశం కోసం మన పెద్దలు ఎంతో పోరాడారని చెప్పుకొచ్చారు. ఈ గాథను తర్వాతి తరాలకు చెప్పడం మర్చిపోవద్దని పిలుపునిచ్చారు. అప్పుడే వారికి పాకిస్థాన్‌తో ఉన్న బంధం బలంగా ఉంటుందన్నారు.
అలానే ఉగ్రవాదులు భవిష్యత్తును నాశనం చేయగలరా? అంటూ మునీర్ చేసిన వ్యాఖ్యలు, పాక్ నిజాయితీగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉందా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ గర్వకారణమని కూడా ఆయన వ్యాఖ్యానించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టే పరోక్ష యత్నమే అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే పాక్ అభివృద్ధిపై ఒక్కమాట కూడా మాట్లాడకుండా.. విద్వేషపు రాజకీయాలతో భావితరాల్ని సైతం మార్చే ప్రయత్నం చేసేలా మాట్లాడడం ఏంటని పలువురు ప్రముఖులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్ స్వతంత్రంగా అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం కశ్మీర్ పేరుతో దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి ప్రయత్నిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications