ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి.. పాకిస్తాన్ రియాక్షన్ ఇదే!
Pakistan: ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ సార్వబౌమాధికారంపై ఈ దాడి ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడులపై పాకిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలలో భాగమని, ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు, హింసను మరింత పెంచుతుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పరిస్థితి పశ్చిమాసియాలోనే కాకుండా మొత్తం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ప్రమాదకరమని పాకిస్థాన్ విశ్వసిస్తోంది.

ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి సంబంధించి అన్ని నియమాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించాయని పాకిస్థాన్ స్పష్టంగా చెప్పింది. ఇరాన్‌కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని.. ఆ దేశంపై ఇటువంటి దాడులను ఏ విధంగానూ సమర్థించలేమని స్పష్టం చేసింది. ఇది అంతర్జాతీయ నియమాలకు వ్యతిరేకంగా ప్రమాదకరమైన చర్య అని పేర్కొంది.
సాధారణ పౌరుల జీవితాలను, ఆస్తులను గౌరవించాలని, యుద్ధం లాంటి చర్యలను వెంటనే ఆపాలని అన్ని దేశాలకు పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది. అలాగే అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని, ముఖ్యంగా మానవ హక్కుల చట్టాన్ని అనుసరించాలని సూచించింది. ప్రస్తుత సంక్షోభాన్ని సంభాషణ, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చని, దీనికి ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు కట్టుబడి ఉండాలని పాకిస్థాన్ తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications