పాక్ పరువుపోయిందిగా.. ముష్టి మాఫియాను గెట్ అవుట్ అంటున్న గల్ఫ్!
పాకిస్థాన్ అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశం నుంచి ప్రజలు ఉపాధి కోసం కాకుండా.. భిక్షాటన కోసం విదేశాలకు వెళ్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భిక్షాటన చేస్తూ పట్టుబడిన పాకిస్థానీయుల సంఖ్య రికార్డు స్థాయికి చేరడంతో సౌదీ అరేబియా కఠిన చర్యలను ప్రారంభించింది.
భిక్షాటన మాఫియాపై సౌదీ, యూఏఈల ఉక్కుపాదం
సౌదీ అరేబియా సర్కారు ఈ ఏడాది ఇప్పటివరకు 24,000 మంది పాకిస్తానీయులను దేశం నుంచి బహిష్కరించింది. వీరంతా పర్యాటక లేదా ఉమ్రా వీసాలపై వచ్చి భిక్షాటనకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కేవలం సౌదీ మాత్రమే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా పాక్ పౌరులపై వీసా ఆంక్షలు విధించింది. దుబాయ్ నుంచి దాదాపు 6,000 మందిని, అజర్ బైజాన్ నుంచి 2,500 మందిని భిక్షాటన ఆరోపణలతో వెనక్కి పంపారు. నేర కార్యకలాపాల్లో కూడా కొందరు పాకిస్తానీయులు పాల్గొంటుండటం అరబ్ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

భిక్షాటన: ఒక వ్యవస్థీకృత మాఫియా
పాకిస్తాన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇది కేవలం పేదరికం వల్ల జరుగుతున్న పని కాదు. దీని వెనుక ఒక భారీ సిండికేట్ (మాఫియా) పనిచేస్తోంది. పవిత్రమైన హజ్, ఉమ్రా వీసాలను ఈ ముఠాలు అడ్డం పెట్టుకుంటున్నాయి. యాత్రికుల ముసుగులో విదేశాలకు వెళ్లి అక్కడ ముఠాలుగా ఏర్పడి భిక్షాటన చేస్తున్నారు. ఈ ముఠాల ఆగడాలను అరికట్టేందుకు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) 2025లో సుమారు 66,154 మంది ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే అడ్డుకుంది. వీరి ప్రయాణ ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉండటమే దీనికి కారణం.
ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న ముష్టి ముఠాలు
పాకిస్తాన్ భిక్షాటన ముఠాలు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాకుండా ఆఫ్రికా, యూరప్, థాయిలాండ్, కాంబోడియా వంటి దేశాలకు కూడా పాకుతున్నాయని FIA డైరెక్టర్ జనరల్ రిఫత్ ముఖ్తార్ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో పట్టుబడుతున్న భిక్షగాళ్లలో 90 శాతం మంది పాకిస్తానీయులే ఉండటం ఆ దేశ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పవిత్ర స్థలాల వద్ద వేధింపులు
మక్కా, మదీనా వంటి అత్యంత పవిత్రమైన ప్రదేశాల వద్ద ఈ భిక్షగాళ్లు విదేశీ యాత్రికులను డబ్బుల కోసం వేధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. "పాకిస్తాన్ తన దేశ భిక్షగాళ్లను అరికట్టకపోతే, సాధారణ యాత్రికులపై కూడా ప్రభావం పడుతుంది" అని సౌదీ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇది పాకిస్తాన్ నుంచి వచ్చే నిజమైన యాత్రికులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తేలా చేస్తోంది. ఒక దేశం తన పౌరులను 'నైపుణ్యం కలిగిన కార్మికులు'గా ఎగుమతి చేయాల్సింది పోయి, 'భిక్షగాళ్లు'గా పంపడం ఆ దేశ దౌర్భాగ్య స్థితిని సూచిస్తోంది. ఆర్థికంగా బలహీనపడటమే కాకుండా, సామాజికంగా కూడా పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ దేశాలు విధిస్తున్న ఈ ఆంక్షలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న 'విదేశీ మారకద్రవ్యం'పై కూడా దెబ్బకొట్టే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications