జాగ్రత్త.. యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్ కురుకునిపోతుంది
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై ఘాటు విమర్శలు చేశారు. రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చేసేదేమీ ఉండదంటూ అన్నారు. తమ దేశ యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్ కూరుకుపోతుందని హెచ్చరించారు. పాకిస్తాన్ గురించి భారత్ కు చెందిన రాజకీయ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని, పరువు నిలబెట్టుకోవడానికి చేసే విఫల ప్రయత్నం అని అన్నారు.
ఈ మేరకు ఖవాజా ఆసిఫ్ తన ఎక్స్ అకౌంట్ లో ఓ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులపై పరోక్షంగా విమర్శలు చేశారాయన. ప్రజల వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. "పాకిస్తాన్ అల్లా పేరు మీద నిర్మితమైన దేశం. మా రక్షకులు అల్లా సైనికులు. ఈ సారి భారత్ వంతు వస్తుంది. భారత్ యుద్ధ విమానాల శిథిలాల కింద కూరుకుపోతుంది.. అల్లాహు అక్బర్" అని రాశారు.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7వ తేదీన 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని ఖవాజా ప్రస్తావించారు. ఈ యుద్ధంలో తమదే విజయమని గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. పలు పాకిస్తానీ డ్రోన్లు, జెట్‌లను ధ్వంసం చేసిందని, సైనిక వైమానిక స్థావరాలకు నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాలు నిరూపించినప్పటికీ.. తన అడ్డగోలు వాదనల నుంచి వెనక్కి తగ్గలేదు ఖవాజా.
ఆపరేషన్ సింధూర్ లో 6-0 తేడాతో భారత్ ఓడిపోయిందని, ఆ ఓటమి తర్వాత కూడా తమ మీద యుద్ధానికి ప్రయత్నిస్తే పాకిస్థాన్ స్కోరు మరింత మెరుగుపడుతుందని అన్నారు. తమ చేతిలో ఓటమి తర్వాత భారత్ లో అక్కడి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, అది వారికి ఇబ్బందికరంగా పరిణమించిందని ఖవాజా చెప్పారు. ఈ వ్యతిరేకత నుంచి బయటపడటానికే తమపై విమర్శలు చేస్తోన్నారని అన్నారు. పాకిస్థాన్‌ను మ్యాప్ నుండి తుడిచిపెట్టడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications