సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి.. 23 మందికి పైగా సైనికులు దుర్మరణం!
పాకిస్తాన్ దేశంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బలూచిస్తాన్‌లోని లాస్‌బెలా జిల్లాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఘోర ఉగ్రదాడిలో దాదాపు 23 మందికి పైగా పాకిస్తానీ సైనికులు మరణించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం సంభవించిన ఈ తీవ్ర పేలుడు ఘటనతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కలకలం రేగింది.
జాతీయ రహదారిపై జరిగిన దారుణం
కరాచీ, క్వెట్టా నగరాలను అనుసంధానించే ఎన్‌హెచ్-25(NH-25) జాతీయ రహదారిపై ఈ దాడి జరిగింది. లాస్‌బెలా జిల్లాలోని కషారీ ప్రాంతం గుండా పాకిస్తాన్ ఫ్రాంటియర్ ఫోర్స్‌కు చెందిన 15 వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా.. ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. సైనిక వాహనాలే లక్ష్యంగా పేలు పదార్థాలను పేల్చడంతో ఓ భద్రతా వాహనం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఈ దాడిలో పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

దాడి వెనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీ హస్తం?
ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ కారణమని అనుమానిస్తున్నారు. గత కొన్ని నెలలుగా బులూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తానీ భద్రతా దళాలు, చెక్‌పోస్టులు, ప్రభుత్వ భవనాలపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ దాడులను తీవ్రతరం చేసింది. తమ మాతృభూమిపై పాక్ సైన్యం సాగిస్తున్న చర్యలకు నిరసనగా భద్రతా దళాల కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఈ సంస్థ గతంలోనే ప్రకటించింది.
ఉద్ధృతంగా గాలింపు చర్యలు
దాడి సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన సైనికులను ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని బేలా క్యాంపుకు తరలించారు. ఈ దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎన్‌హెచ్-25 జాతీయ రహదారిని పూర్తిగా మూసివేశారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలింపు చర్యలను ప్రారంభించాయి. అయితే మృతుల సంఖ్యపై పాకిస్తాన్ సైన్యం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
