వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్: ఇమ్రాన్‌ ఖాన్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాణిజ్య లోటు వంద శాతం నమోదైందని ఆ దేశ గణాంక శాఖ చెబుతోంది.

వాణిజ్య లోటుతో పాటు 'కరెంట్ అకౌంట్ లోటు'ను తగ్గించడానికి దిగుమతులను తగ్గిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించింది.

గత ఆర్థిక సంవత్సరంలో, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వం ఈ వాణిజ్య లోటును కాస్త తగ్గించగలిగింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు భారీగా పెరిగాయి. దీనివల్ల వాణిజ్య లోటు కూడా పెరిగింది.

వాణిజ్య లోటు పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకర సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఇది కరెంట్ అకౌంట్ లోటును పెంచడంతో పాటు విదేశీ మారకంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. డాలర్‌తో పోల్చితే పాకిస్తాన్ రూపాయి మారకం విలువపై కూడా దీని ప్రతికూల ప్రభావం ఉంటుందని వారంటున్నారు.

డాలరు మారకం విలువతో ప్రస్తుతం దేశీయ కరెన్సీ తీవ్ర ఒత్తిడిలో ఉంది. దిగుమతులు అధికం కావడం, డాలర్లకు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మరోవైపు ఎగుమతుల్లోనూ చాలా స్వల్ప వృద్ధి నమోదైంది.

ఈ ఆర్థిక సంవత్సరం, తొలి త్రైమాసికంలో అధిక దిగుమతుల కారణంగా వాణిజ్య లోటు పెరిగిపోయిందని నిపుణులు అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది 'రెడ్ జోన్' లాంటిదని వారు వర్ణిస్తున్నారు.

పాకిస్తాన్ కరెన్సీ

పెరుగుతున్న దిగుమతులు

ప్రభుత్వ డేటా ప్రకారం, గత ఏడాది తొలి క్వార్టర్‌లో 5.8 బిలియన్ డాలర్లు (రూ. 99,101 కోట్లు- పాకిస్తాన్ మారకం విలువ)గా ఉన్న వాణిజ్య లోటు... ఈ ఏడాదికి 11.6 బిలియన్ డాలర్ల (రూ. 2,01,649 కోట్లు)కు పెరిగింది.

ఈ ఏడాది తొలి క్వార్టర్ అయిన జులై-సెప్టెంబర్ నెలల్లో దిగుమతులు 18.63 బిలియన్ డాలర్ల (రూ. 3,18,384 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇవి 11.2 బిలియన్ డాలర్లు (రూ. 1,91,405 కోట్లు)గా ఉన్నాయి. అంటే దిగుమతులు 65 శాతానికిపైగా పెరిగాయి.

మరోవైపు దేశ ఎగుమతులు కూడా పెరిగాయి. కానీ ఇందులో నమోదైన వృద్ధి 27 శాతమే. గతేడాది తొలి క్వార్టర్‌లో 5.47 బిలియన్ డాలర్ల (రూ. 93,480 కోట్లు) ఎగుమతులు జరుగగా... ఈసారి వాటి విలువ 6.9 బిలియన్ డాలర్ల (రూ.1,17,919 కోట్లు)కు చేరింది.

గత ప్రభుత్వానికి చెందిన చివరి ఆర్థిక సంవత్సరంలో, పాకిస్తాన్ వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరింది. ఆ సమయంలో వాణిజ్య లోటు 37 బిలియన్ డాలర్లు (రూ.6,32,325 కోట్లు)గా నమోదైంది.

కానీ, దీన్ని ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పీటీఐ సర్కారు క్రమంగా తగ్గించింది. దేశ పగ్గాలు చేపట్టిన, తొలి ఆర్థిక సంవత్సరంలో దీన్ని 31 బిలియన్ డాలర్ల (రూ. 5,29,244 కోట్లు)కు తగ్గేలా చర్యలు తీసుకున్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం... రెండో ఏడాది 23 బిలియన్ డాలర్ల (రూ. 3,92,812 కోట్లు)కు పడిపోయేలా చేసింది.

అయితే, ఈ పురోగతిని కొనసాగించలేకపోయింది. మూడో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ వాణిజ్యలోటు మరోసారి 30 బిలియన్ డాలర్లకు చేరింది. అప్పటినుంచి ఇది పెరుగుతూనే ఉంది. 2021 జూన్ 30తో ప్రస్తుత ప్రభుత్వం, మూడో ఆర్థిక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది.

పాకిస్తాన్

పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఉత్పత్తులేంటి?

పాకిస్తాన్‌కు దిగుమతయ్యే ఉత్పత్తుల్ని గమనిస్తే... అక్కడ ఆహార పదార్థాలు, చమురు ఉత్పత్తులు, వాహనాలు, మెషినరీ వస్తువుల దిగుమతులు భారీగా పెరిగాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో దిగుమతి అయిన ఉత్పత్తులను పరిశీలిద్దాం. కేవలం, ఆగస్టులోనే పాకిస్తాన్ 66,000 మెట్రిక్ టన్నుల చక్కెరను దిగుమతి చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2020 ఆగస్టులో పాకిస్తాన్‌కు 917 మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతి అయింది.

అలాగే గోధుమ 70 శాతం, పామాయిల్ ఉత్పత్తుల దిగుమతులు 120 శాతం మేర పెరిగాయి.

పప్పు ధాన్యాల దిగుమతుల్లో 84 శాతం, తేయాకు ఉత్పత్తుల్లో 24 శాతం పెరుగుదల ఉంది.

మరోవైపు, చమురు ఉత్పత్తులు 128 శాతం పెరగగా... వాహనాలకు సంబంధించిన దిగుమతుల్లో 200 శాతానికి పైగా వృద్ధి నమోదైంది.

అలాగే మెషినరీ ఉత్పత్తులను కూడా భారీగానే దిగుమతి చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో ఇతర దేశాల నుంచి కరోనా వ్యాక్సీన్‌ను రప్పించడం కూడా దిగుమతుల్లో పెరుగుదలకు ఒక కారణమని చెబుతున్నారు.

పాకిస్తాన్

దిగుమతులు భారీగా పెరగడానికి కారణం ఏమిటి?

ఆహారం, చమురు ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, మెషినరీ, వాహనాల అధిక వినియోగం కారణంగానే పాకిస్తాన్ చేసుకునే దిగుమతులు భారీగా పెరిగాయని ఆర్థికవేత్త ఖుర్రమ్ షహజాద్ చెప్పారు.

''డిమాండ్ మేరకు, స్థానికంగా ఈ వనరుల లభ్యత, ఉత్పత్తి అవసరమైనంత లేకపోవడంతోనే దిగుమతులు పెరిగాయి'' అని ఆయన వివరించారు.

''దిగుమతులు పెరిగినంత మేర దేశ ఎగుమతులు పెరగకపోవడం వాణిజ్యలోటు ఏర్పడటానికి రెండో ముఖ్య కారణం''

''ఉత్పత్తుల అధిక వినియోగానికి అనేక కారణాలుంటాయి. అందులో ఒకటి ఏంటంటే... ఆదాయ వనరులు పెరిగినప్పుడు, వినియోగం కూడా పెరుగుతుంది'' అని ఆయన వివరించారు.

అధిక వినియోగాన్ని మంచి పరిణామంగానే వర్ణించిన ఆయన... ఆ వినియోగ అవసరాలను తీర్చుకునేందుకు సదరు ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తే, వాణిజ్య లోటు రూపంలో దేశం నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు.

''ఆహార పదార్థాలు, మెషినరీ, వాహనాలు, చమురు ఉత్పత్తుల దిగుమతుల కారణంగానే వ్యయం అధికమైంది. పాకిస్తానీ ప్రజల ఆదాయం పెరగలేదు. కానీ వారు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు'' అని బీబీసీ ఉర్దూతో ఆర్థికవేత్త, డాక్టర్ ఫరూఖ్ సలీమ్ చెప్పారు.

2018 నుంచి ఇప్పటివరకు చూస్తే, పాకిస్తానీయుల తలసరి ఆదాయంలో తగ్గుదల ఉందని ఆయన అన్నారు. గతంలో 1,482 డాలర్లు (రూ. 2,53,202)గా ఉండగా, అది 1,190 డాలర్ల (రూ. 2,03,330)కు పడిపోయిందని చెప్పారు.

''వాణిజ్య లోటు పెరగడానికి ప్రధాన కారణం ఎగుమతులు తగ్గిపోవడమే. చివరిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 31 బిలియన్ డాలర్ల (రూ. 5,29,756)కు చేరినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంది. అది 2013-14 ఆర్థిక సంవత్సరంలో సాధ్యమైంది. ఆ తర్వాత నుంచి ఎగుమతులు పడిపోవడం ప్రారంభమైంది''

''డాలర్ విలువను అప్పటితో పోల్చి చూస్తే, ఎగుమతుల పరంగా పాకిస్తాన్ ఇప్పుడు ఎలాంటి వృద్ధి సాధించనట్లే. పామాయిల్, గోధుమలు, చక్కెర వంటి ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకుంటున్నామంటే దానర్థం వాణిజ్య లోటు మరింత విస్తృతం అవుతున్నట్లే. వీటితో పాటు, కొన్నాళ్లుగా, టెక్స్‌టైల్స్ రంగంలో కూడా మెషినరీ ఉత్పత్తుల దిగుమతులు పెరుగుతున్నాయి'' అని ఫరూఖ్ వివరించారు.

పాకిస్తాన్‌కు దిగుమతయ్యే ఆహార పదార్థాలను అక్రమంగా అఫ్గానిస్తాన్‌కు తరలిస్తున్నారనే వాదనను ఆయన తోసిపుచారు. ఇలా అక్రమంగా తరలిన, ఖరీదైన ఆహార పదార్థాలను కొనే శక్తి అఫ్గాన్ ప్రజలకు ప్రస్తుతం లేదని అన్నారు.

బయట నుంచి అందుతోన్న నిధుల ద్వారా పాకిస్తాన్‌కు లబ్ధి కలుగుతోందని, లేకపోతే పెరుగుతోన్న వాణిజ్య లోటు కారణంగా పాకిస్తాన్ కరెంట్ అకౌంట్ లోటు విపరీతంగా ప్రభావితం అయ్యేదని చెప్పారు.

''దేశంలో దిగుమతి అయ్యే చాలా ఉత్పత్తులపై, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ 100 శాతం క్యాష్ మార్జిన్ విధించింది. అయినప్పటికీ దిగుమతులపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఎందుకంటే అధిక ధరలు ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల వినియోగం కొనసాగుతోంది'' అని వివరించారు.

అధిక దిగుమతుల కారణంగా పెరుగుతోన్న వాణిజ్య లోటుపై ఏమంటారని ప్రధానమంత్రి వాణిజ్య వ్యవహారాల సలహాదారు రజాక్ దావూద్‌ను సంప్రదించగా.. ''దిగుమతులు ఎందుకు పెరిగాయనేది చెప్పడం సంక్లిష్టమైన అంశం'' అని అన్నారు. దాని గురించి తర్వాత మాట్లాడతానన్న ఆయన మళ్లీ దాని ప్రస్తావన ఎత్తలేదు.

పాకిస్తాన్ కార్ల పరిశ్రమ

వాణిజ్య లోటు పెరుగుదల ఎంత ప్రమాదకరం?

దేశ వాణిజ్య లోటు పెరుగుదలను 'రెడ్ జోన్'గా డాక్టర్ ఫరూఖ్ సలీమ్ అభివర్ణించారు. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరిగిపోయి, విదేశీ మారక విలువ పడిపోయి... దేశం ఒక సంక్లిష్టమైన చట్రంలో చిక్కుకుంటుందని అన్నారు. ప్రజల ఆదాయం పడిపోవడంతో దేశంలో పేదరికం పెరుగుతుందని చెప్పారు.

''వాణిజ్య లోటును తగ్గించడానికి, పీటీఐ ప్రభుత్వం చేపడుతున్నామని చెబుతున్న చర్యలన్నీ సామాజిక మాధ్యమాలకు మాత్రమే పరిమితం. లేదా అలాంటి చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వం భావిస్తుందేమో! వాస్తవంగా చూస్తే మాత్రం, దీన్ని తగ్గించడానికి వారివద్ద పటిష్ట వ్యూహమేదీ లేదు.

ఈ విషయంలో నమోదవుతోన్న ఫలితాలను చూస్తే ఇది అర్థమైపోతుంది. ఈ ప్రభుత్వం ఎంత విజయవంతమైందో దీని ద్వారానే చెప్పొచ్చు. ప్రస్తుత ఫలితాలను బట్టి, వాణిజ్య లోటును తగ్గించడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని తెలిసిపోతుంది'' అని ఫరూఖ్ అన్నారు.

కేవలం 3 నెలల్లోనే 12 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైతే, ఏడాది చివరి వరకు ఎంత భారీ స్థాయిలో అది వృద్ధి చెందుతుందో అంచనా వేయొచ్చని ఆయన అన్నారు.

దేశ తలసరి ఆదాయంలో వాణిజ్య లోటు 3 శాతమే ఉంటే పెద్దగా ఆందోళన చెందక్కర్లేదని ఖుర్రమ్ షహజాద్ అన్నారు. ఒకవేళ ఇది 4 శాతం దాటి ఇంకా పెరుగుతుంటే మాత్రం, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకర సంకేతంగా మారుతోందని గమనించాలి" అని చెప్పారు.

దేశ ఆర్థిక వ్యవస్థను, స్థానిక ఉత్పత్తులను మెరుగుపరచడానికి అధికార ప్రభుత్వం, పటిష్టమైన సంస్కరణలు అమలు చేయలేదు. అందుకే దిగుమతుల కారణంగా వాణిజ్య లోటు పెరుగుతోందని ఖుర్రమ్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Pakistan, Economy, Imran Khan,పాకిస్తాన్, ఆర్థిక వ్యవస్థ, ఇమ్రాన్ ఖాన్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X