భారతీయులకు గిఫ్ట్ ప్రకటించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ - మోదీని కలిసిన వెంటనే..!!
జకర్తా: ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. జీ20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇందులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు సెషన్స్‌లో పాల్గొంటోన్నారు. రెండో రోజు అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఎమ్మానుయేల్ మక్రాన్, ఈ సమ్మిట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఇండొనేషియా ప్రధానమంత్రి జొకొ విడొడొతో కలిసి ప్రధాని మోదీ- మడ అడవులను సందర్శించారు.

రెండో రోజూ బిజీగా..
తొలి రోజు సెషన్స్‌లో ప్రధాని మోదీ తీరిక లేకుండా గడిపిన విషయం తెలిసిందే. ఆహారం, ఇంధన భద్రత అంశంపై ఏర్పాటైన వర్కింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆహార భధ్రత, ఎరువులు, ఇంధన అవసరాలను ఆయన ప్రస్తావించారు. జీ20 లీడర్స్ సమ్మిట్‌లో జో బైడెన్‌ను కలుసుకున్నారు. ఈ సెషన్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలిశారు. జీ20 సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చిన బాలి నుసు దువా కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో మోదీని మర్యాదపూరకంగా కలిశారు రిషి సునాక్.

రిషి సునాక్‌తో..
ఈ సందర్భంగా రిషి పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటన్‌కు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన రిషి సునాక్‌ను మోదీ అభినందించారు. ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకుని, ప్రశంసించారు. భారత్-బ్రిటన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న స్నేహ సంబంధాల గురించి ప్రస్తావించారు. దౌత్య సంబంధాల గురించి క్లుప్తంగా మాట్లాడారు. త్వరలో భారత పర్యటనకు రావాలని ఆహ్వానించినట్లు జాతీయ మీడియా తెలిపింది.

విసాల కోటా పెంపు..
కాగా- ఈ భేటీ తరువాత బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయుల కోసం కేటాయించిన విసాల కోటాను పెంచినట్లు ప్రకటించింది. ప్రతి సంవత్సరం కూడా మూడువేల యూకే విసాలను అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న సంఖ్యకు అదనంగా ఏటా మూడువేల విసాలను అందనంగా ఇవ్వాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది.

రెండేళ్ల విసాల కోసం..
భారత్- బ్రిటన్ మధ్య యంగ్ ప్రొఫెషనల్స్ పథకాన్ని ఆమోదించినట్లు పేర్కొంది. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ హోల్డర్లు తమదేశంలో రెండు సంవత్సరాల వరకు జీవించడానికి, పని చేయడానికి అవసరమైన 3,000 విసాలను మంజూరు చేసినట్లు రిషి సునాక్ కార్యాలయం స్పష్టం చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న మైగ్రేషన్, మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ను మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది.

భారత్ నుంచే అధికం..
ఇండో-పసిఫిక్ రీజియన్‌లోని దాదాపు అన్ని దేశాల కంటే భారత్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలను తాము కొనసాగిస్తోన్నామని, దీన్ని మరింత పటిష్టపర్చడంలో భాగంగా యంగ్ ప్రొఫెషన్స్ స్కీమ్ అమలు చేస్తోన్నామని గుర్తు చేసింది. వివిధ దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులలో నాలుగు వంతుల మంది భారతీయులేనని పేర్కొంది.












Click it and Unblock the Notifications