భారత్ పై చర్యలకు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఆ సంతకంతో తలకిందులు
రష్యా, ఇరాన్‌పై ఆంక్షలను మరింత కఠినతరం చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టం రూపం దాల్చింది. ఈ చట్టం.. భారత్, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్ విధించడానికి అధ్యక్షుడికి పూర్తి అధికారాలను కల్పించిందీ చట్టం.
శుక్రవారం ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దీనిపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లిండ్సే ఒ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్.. పేరుతో ఈ బిల్లు రూపుదిద్దుకుంది. ఈ నెల 16వ తేదీన దీన్ని యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ భారీ మెజారిటీతో ఆమోదించింది. రష్యా ఇంధన రంగం, ఆ దేశ రక్షణ రంగానికి సహకరిస్తున్న విదేశీ సంస్థలు, అంతర్జాతీయ చమురు మార్కెట్లలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ముడి చమురును రవాణా చేసే షాడో ఫ్లీట్ లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించింది.

రష్యాతో వ్యూహాత్మక వ్యాపార లావాదేవీలు జరిపే అంతర్జాతీయ భాగస్వాములపై కఠిన నిబంధనలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వనరులను పూర్తిగా దెబ్బతీయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన 30 రోజుల్లోగా ఇది అమలులోకి వస్తుంది. గత ఏడాది కాలంలో రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసిన మొదటి అయిదు దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్ విధించవచ్చు.
ఈ అయిదు దేశాల జాబితాలో భారత్, చైనా, టర్కీ, అజర్ బైజాన్, హంగేరి ఉన్నాయి. వీటి తర్వాతి స్థానం.. సింగపూర్, స్లొవాక్ రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ వి. ఈ టారిఫ్ అమలు, నిబంధనల సడలింపు విషయంలో ట్రంప్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ దేశంపై ఎంత పన్ను విధించాలనేది పూర్తిగా ఆయన విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ ను క్రమంగా తగ్గించుకునే దేశాలకు ఈ పన్నుల నుంచి అమెరికా కొంతవరకు మినహాయింపును ఇవ్వొచ్చు.
రష్యాకు పరోక్షంగా రవాణా సదుపాయాలు కల్పించే అంతర్జాతీయ కంపెనీలను కూడా దెబ్బకొడుతుందీ యాక్ట్. చమురు కొనుగోలు లావాదేవీలు, రవాణాలోనూ భాగస్వామ్యం అయ్యే నౌకల యజమానులు, ఆపరేటర్లు, మేనేజర్లు, బీమా సంస్థలపై కూడా అమెరికా కఠినమైన ఆంక్షలను విధించవచ్చు. ఫలితంగా అంతర్జాతీయ నౌకాయన రంగంలో రష్యా చమురును రవాణా చేయడానికి ప్రధాన కంపెనీలు వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడుతుంది.













Click it and Unblock the Notifications
