భారత్ పై చర్యలకు అమెరికన్ హౌస్.. సై: డొనాల్డ్ ట్రంప్‌కు సర్వాధికారాలు
రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటోన్న భారత్ సహా ఇతర దేశాలకు గట్టి షాక్ ఇచ్చింది అమెరికా. దీనికోసం ఓ నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆయా దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్ విధించేలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అపరిమిత అధికారాలు కల్పించే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. రష్యా ఆయిల్ ను కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ పై మాస్కో సాగిస్తున్న యుద్ధానికి పరోక్షంగా సహాయం అందిస్తున్నాయనేది అమెరికా వాదన.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో రష్యా నుంచి అత్యధిక మోతాదులో ఇంధనాన్ని చౌకగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాల ఏకపక్ష ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా భారత్, చైనా.. రష్యా ముడి చమురు దిగుమతులను విపరీతంగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ పేరుతో ప్రతిపాదించిన ఈ బిల్లుపై యూఎస్ హౌస్ ఓటింగ్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 214-211 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. మెజారిటీ రిపబ్లికన్ సభ్యులకు తోడుగా ఇద్దరు డెమొక్రాటిక్ ప్రజాప్రతినిధులు కూడా మద్దతు పలికారు. దీంతో 214-211 ఓట్ల అతి తక్కువ తేడాతో ఈ ప్రతిపాదన తదుపరి దశకు చేరుకుంది. తుది నిర్ణయాత్మక ఓటింగ్ బుధవారం జరుగనుంది.
ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటోన్న భారత్, చైనా, టర్కీ, అజర్ బైజాన్, హంగేరి, సింగపూర్, స్లొవాక్ రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ పై 100 శాతం టారిఫ్‌లను విధించడానికి డొనాల్డ్ ట్రంప్‌కు సర్వాధికారాలు లభిస్తాయి. దీనివల్ల ఆయా దేశాల నుంచి అమెరికాకు జరిగే ఎగుమతుల ధరలు భారీగా పెరిగిపోతాయి.
ఈ బిల్లు ద్వారా రష్యా మాత్రమే కాకుండా ఇరాన్‌పై కూడా అత్యంత కఠినమైన ఆంక్షలను పొడిగించడానికి అమెరికా రంగం సిద్ధం చేసింది. 1996 నాటి ఇరాన్ ఆంక్షల చట్టాన్ని 2031 సంవత్సరం వరకు పొడిగించేలా, ఆ దేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలపై పెనాల్టీలు విధించేలా కఠిన మార్గదర్శకాలను ఇందులో పొందుపర్చారు.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయరాదంటూ అమెరికా గతంలోనే హెచ్చరించింది. దీన్ని పెద్దగా పట్టించుకోలేదు కేంద్రం. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను భారీగా పెంచుకుంది. ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభ తీసుకునే తుది నిర్ణయం భారత్-అమెరికా దౌత్య ప్రయాణంలో కీలక మలుపుగా మారే అవకాశం లేకపోలేదు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశమౌతోంది.














Click it and Unblock the Notifications
