ఉక్రెయిన్ నగరాలపై దాడులకు రష్యా సిద్ధంగా ఉంది, భారీ ప్రాణనష్టం: యూఎస్ హెచ్చరిక
వాషింగ్టన్: ఉక్రెయిన్ నగరాలపై భారీ వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. ఈ క్రమంలో అమెరికా, నాటో కూటమి హెచ్చరిక జారీ చేసింది. ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని పర్యవేక్షిస్తున్న యూఎస్, నాటో అధికారులు సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ.. రష్యా "నగరాలను లొంగదీసుకోవడానికి" సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది, రష్యా వ్యూహంలో ఈ వారం ప్రారంభంలో స్పష్టమైన మార్పు గమనించబడింది, ఇది అధిక పౌర ప్రాణనష్టానికి దారితీయవచ్చని హెచ్చరించింది.
కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం యూఎస్ సెనేటర్లతో మాట్లాడనున్నారు.
ఉక్రేనియన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానం గురించి తెలిసిన వ్యక్తి ప్రకారం.. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం యూఎస్ సెనేటర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడనున్నారు.
కాగా, ఐక్యరాజ్యసమితితోపాటు పలు దేశాలు దాడులు ఆపాలని కోరుతున్నప్పటికీ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాటోలో చేరవద్దని రష్యా కోరినప్పటికీ.. అందుకు ఉక్రెయిన్ నిరాకరించడంతో రష్యా ఈ దాడులకు పాల్పడుతోంది. కాగా, మరోసారి రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు తాజాగా, సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లోనైనా దాడులు ఆపేందుకు రష్యా అంగీకరిస్తుందో లేదో చూడాలి.

ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోనే వెయ్యి మంది విద్యార్థులు
ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. కీవ్ తోపాటు పలు నగరాలు ధ్వంసమవుతున్నాయి. కాగా, ఉక్రెయిన్ దేశంలోని తూర్పు ప్రాంతంలో వెయ్యి మంది భారతీయులు చిక్కుకుపోయారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖర్కివ్ లో 300 మంది, సుమీలో 700 మంది భారతీయులు ఉండిపోయారని తెలిపింది. వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఈ అంశంపై ఉక్రెయిన్, రష్యా దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి విద్యార్థులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 48 ప్రత్యేక విమానాల్లో 10,300 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఫిబ్రవరిలో అడ్వైజరీ జారీ చేసిన తర్వాత దాదాపు 20వేల మంది ఉక్రెయిన్ సరిహద్దులను దాటారు. వారిలో ఇప్పటికే 10వేలకుపైగా భారతీయులు స్వదేశానికి తీసుకువచ్చామని పేర్కొంది. 24 గంటల్లో మరో 16 విమానాలు భారత్ కు రానున్నాయి. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అక్కడ్నుంచి తరలించేందుకు అన్ని మార్గాలపై దృష్టి సారించామని వెల్లడించింది.
తమ పౌరులను తీసుకెళ్లేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ పాటిస్తే కాస్త ఊరట లభిస్తుందని తెలిపింది. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపింది. కాగా, ఉక్రెయిన్ నుంచి శుక్రవారంనాడు 14 విమానాలు, మూడు ఐఏఎఫ్ విమానాల్లో 3772 మంది భారత్ చేరుకున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది.
#OperationGanga | A special Indigo flight, carrying 229 Indian nationals from #Ukraine, arrives in Delhi from Suceava in Romania pic.twitter.com/mucdrnJk1R
— ANI (@ANI) March 5, 2022
శనివారం మరో 11 పౌర విమానాలు, నాలుగు వాయుసేన విమానాల్లో 2200 మంది స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న నగరాల్లోని భారతీయులను రష్యాకు తరలించి అక్కడ్నుంచి భారత్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు రష్యా కూడా సహకరించేందుకు అంగీకరించింది. ఉక్రెయిన్ నగరాల్లో చిక్కుకున్న భారతీయులను తమ బస్సులలో రష్యాకు తరలిస్తామని పేర్కొంది. కాగా, శనివారం తెల్లవారుజామున 200 మందికిపైగా భారతీయ విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications