భారత్‌కు గుడ్‌న్యూస్: రష్యా సంచలన నిర్ణయం, మానవతా కారిడార్ కోసం కాల్పుల విరమణ
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా నిర్విరామంగా ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేస్తున్న రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరుల కోసం మానవతా కారిడార్‌లను తెరవడానికి రష్యా శనివారం 06:00 GMT (గ్రీన్‌విచ్ మీన్ టైమ్ జోన్) నుంచి ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ మీడియా అవుట్‌లెట్ స్పుత్నిక్ నివేదించింది.

మానవతా కారిడార్ల కోసం రష్యా కాల్పుల విరమణ
'శనివారంనాడు, మార్చి 5 న, మాస్కో సమయం ఉదయం 10 గంటలకు, రష్యా వైపు కాల్పుల విరమణ ప్రకటించింది. మారియుపోల్, వోల్నోవాఖా నుంచి పౌరులు నిష్క్రమణ కోసం మానవతా కారిడార్‌లను తెరుస్తుంది' అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం మీడియాకు తెలిపారు. మానవతా కారిడార్లు, నిష్క్రమణ మార్గాలను ఉక్రెయిన్ వైపు అంగీకరించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారతీయ, ఇతర దేశాల విద్యార్థుల తరలింపునకు రష్యా సాయం
తూర్పు ఐరోపా దేశంలో తీవ్ర ఘర్షణల మధ్య, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను, ఇతర విదేశీ పౌరులను తరలించడానికి తూర్పు ఉక్రేనియన్ నగరాలైన ఖార్కివ్, సుమీకి వెళ్లడానికి రష్యన్ బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని ఇంతకుముందు రష్యా యూఎన్ భద్రతా మండలికి తెలియజేసింది. ఐరోపాలో అతిపెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, అల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ పిలుపునిచ్చిన 15 దేశాల కౌన్సిల్ శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

విదేశీయుల తరలింపునకు రష్యా సైన్యం అన్ని విధాల కృషి
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను శాంతియుతంగా తరలించేందుకు రష్యా సైన్యం అన్ని విధాలా కృషి చేస్తోందని ఐక్యరాజ్యసమితి రాయబారి వాసిలీ నెబెంజియా సమావేశంలో అన్నారు. ఉక్రెయిన్ జాతీయవాదులు తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీ నగరాల్లో 3,700 మంది భారతీయ పౌరులను బలవంతంగా నిర్బంధించారని ఆయన ఆరోపించారు.
అయితే, భారత్ రష్యా వాదనను అంగీకరించలేదు. అలాంటిదేమీ లేదని పేర్కొంది. భారతీయ విద్యార్థుల తరలింపునకు రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా సహకరిస్తోందని తెలిపింది.
ఇప్పటికే 10వేల మందికిపైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పేర్కొంది. మిగిలిన విద్యార్థులను కూడా వేగంగా తరలిస్తున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం వైపున ఉన్న భారతీయ విద్యార్థులను రష్యాకు తరలించి, అక్కడ్నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇప్పటికే పలువురు విద్యార్థులను ఆయా ప్రాంతాల నుంచి రష్యాకు, ఇతర సరిహద్దు దేశాలకు తరలిస్తోంది. రష్యా తాజా కాల్పుల విరమణ నిర్ణయంతో భారతీయ విద్యార్థులను తరలించడం భారత్‌కు మరింత సులభం కానుంది.












Click it and Unblock the Notifications