మనీలాండరింగ్ కేసు సంచలనం: బంగ్లాలు, లగ్జరీ కార్లు సహా రూ. 4491 కోట్లు సీజ్
సింగపూర్: సింగపూర్ కేంద్రంగా నడుస్తున్న భారీ మనీలాండరింగ్ వ్యవహారం బయటపడింది. హవాలాకు పాల్పడుతున్న ఒక విదేశీ ముఠా గుట్టురట్టు చేశారు సింగపూర్ పోలీసులు. వారి నుంచి పెద్ద బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, నగలు, బంగారు బిస్కెట్లు అన్నీ కలిపి సుమారు 734.32 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూపాయల్లో 4491 కోట్లు) ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.
గత మంగళవారం ఆర్నార్డ్ రోడ్ షాపింగ్ బెల్ట్ నుంచి సెంటోసా రిసార్ట్ ఐలాండ్ వరకు జరిపిన సోదాల్లో సుమారు 400 మంది పోలీసు బలగాలు పాల్గొన్నాయని.. ఈ ముఠా కోసం నగరమంతా జల్లెడ పట్టామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధానంగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో 94 ఆస్తులు, 110 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 672 కోట్లు) ఉన్న బ్యాంక్ అకౌంట్లు, 50 లగ్జరీ కార్లు, 23 మిలియిన్ సింగపూర్ డాలర్ల నగదు, వందలకొద్దీ హ్యాండ్ బ్యాగ్‌లు, నగలు, బంగారు బిస్కెట్లు.. ఇవన్నీ కలిపి మొత్తంగా రూ. 4491 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడుల్లో ఆయా దేశాలకు చెందిన 31 నుంచి 41 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పది మంది ముఠాను పట్టుకున్నామని.. వీరంతా చైనా, కాంబోడియా, సిప్రస్, వణువతు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరిలో ఓ మహిళ కూడా ఉందన్నారు. ఈ ముఠాలో సిప్రస్‌కు చెందిన వ్యక్తి తప్పించుకోబోయి తన బంగ్లా రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయాలపాలయ్యాడు.
ఈ ముఠా ఆన్‌లైన్లో జూదం, విదేశీ మాఫియా, ఇతర స్కాంలతోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతోనే తాము దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సింగపూర్ మానిటరీ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు చెప్పారు. ఈ ముఠాకి సహకరించిన ఆర్థిక సంస్థలను ఉపేక్షించేది లేదన్నారు.












Click it and Unblock the Notifications