151కి చేరిన మరణాల సంఖ్య - హాలోవీన్ వేడుకల్లో పెను విషాదం..!!
హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం మేరకు మరణాల సంఖ్య 151 కి చేరగా, మరో 150 మందికి పైగా గాయాల బారిన పడ్డారు. శనివారం రాత్రం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఏటా జరిగే హాలోవీన్ వేడుకల్లో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. హాలోవీన్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తొక్కిసలాట జరిగిన సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండటంతో పాటుగా అనేక మంది ఊపిరి ఆడక మరణించారు.
ఆ టెన్షన్ లో పలువురు గుండె పోటుకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనలో అనేక మంది గాయాల బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఎమర్జెన్సీ సేవల్లో ఉన్న వందలాది మంది సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతంలో మొహరించింది.

400 మంది సిబ్బందితో పాటుగా 140 వాహనాల ద్వారా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరణాల సంఖ్య పెరగే అవకాశముందని సియోల్ యోంగ్సన్ అగ్నిమాపక విభాగం అధికారులు అంచనా వేసారు. అధికారికంగా మాత్రం 151 మరణాలను నిర్ధారించారు. చాలామంది మృతదేహాలు వీధుల్లోనే ఉండగా, వాటిని తరలిస్తున్నారు.
ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ విధించినట్లు అధికారులు వెల్లడించారు. తొక్కసలాటలో ఊపిరి ఆడక ఆపస్మారక స్థితిలో పడి ఉన్న వారికి సీపీఆర్ చికిత్స అందించే ప్రయత్నాలు జరిగాయి. దీంతో కొంత మంది ప్రాణాపాయం నుంచి చివరి నిమిషంలో బయట పడ్డారు. దక్షిణ కొరియాలో కరోనావైరస్ ఆంక్షల్ని సడలించడంతో ఈ హాలోవీన్ వేడుకలకు దాదాపు లక్షమంది వరకు హాజరయ్యారని స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదే సమయంలో ఒక సెలబ్రెటీ వచ్చారనే వదంతులతో ఒక్క సారిగా తొక్కిసలాట చోటు చేసుకుందని సమాచారం. ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని, పండుగ ప్రదేశాల్లో భద్రతను సమీక్షించాలని అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications