శ్రీలంక అధ్యక్షుడి ఉద్వాసన దిశగా: అత్యవసర పార్లమెంట్ భేటీకి ప్రధాని పిలుపు
కొలంబో: సుదీర్ఘకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తోన్న శ్రీలంకలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రజలు మళ్లీ రోడ్డెక్కారు. ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శలను చేపట్టారు. ఈ సారి ఏకంగా దేశాధ్యక్షుడి భవనాన్ని ముట్టడించారు. భద్రతను సైతం లెక్క చేయలేదు. మూడంచెల భద్రత వలయాన్ని ఛేదించుకుని మరీ.. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసంలోకి దూసుకెళ్లారు.
ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన గొటబయ.. తన నివాసాన్ని వదిలి పెట్టి పారిపోయారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ అంబులెన్స్‌లో పరార్ అయ్యారు. ఆందోళనకారులను నిలువరించడానికి భద్రత సిబ్బంది చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాఠీ ఛార్జీలతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న దాడులు, ప్రతిదాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. 50 మందికి పైగా ప్రదర్శనకారులు గాయపడ్డారు.

కొందరు భద్రత సిబ్బంది, పోలీసులకూ దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం వారంతా కొలంబోలోని నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొలంబో మాత్రమే కాకుండా.. దాదాపు శ్రీలంకలోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వచ్చారు. గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలంటూ నినదించారు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె అత్యవసర పార్టీ నాయకుల సమావేశానికి పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. దేశంలో రోజురోజుకూ ముదిరిపోతోన్న సంక్షోభ పరిస్థితులను శాశ్వత పరిష్కారం చూపేలా చేపట్టాల్సిన తక్షణ చర్యలపై దృష్టి సారించారు. అదే సమయంలో అత్యవసరంగా పార్లమెంట్‌ను సమావేశపర్చాలంటూ ప్రధాని రణిల్ విక్రమసింఘె స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రజల డిమాండ్ మేరకు కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇందులో భాగంగా గొటబయ రాజపక్సను దేశాధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికే దిశగా రణిల విక్రమసింఘె అడుగులు వేస్తోన్నారని తెలుస్తోంది. అత్యవసరంగా పార్లమెంట్‌ను సమావేశ పర్చి.. దీనిపై ఓ చట్టాన్ని తీసుకుని రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. పార్లమెంట్‌ను అత్యవసరంగా సమావేశ పర్చాలంటూ రణిల్ విక్రమసింఘె- స్పీకర్ మహింద యాప అబేయవర్దనెకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications