వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sri Lanka: ''పెట్రోల్ కోసం 10 రోజులుగా లైన్‌లోనే ఉన్నా... కారులోనే పడుకుంటున్నా''

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గత వారం నుంచి కారులోనే నిద్రిస్తున్నట్లు మినీ బస్ డ్రైవర్, 43 ఏళ్ల ప్రతీమ్ చెప్పారు

శ్రీలంకలో ఇంధనం కోసం వాహనాలు క్యూలు కట్టడం సాధారణంగా మారిపోయింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో శ్రీలంక, తగినంత ఇంధనాన్ని దిగుమతి చేసుకోలేకపోతోంది.

రాజధాని కొలంబోలో ఇంధనం కోసం వాహనాలు కట్టిన క్యూ 5 కి.మీ పొడవుంది. అదే క్యూలోని మినీ బస్‌లో 43 ఏళ్ల ప్రతీమ్ ఉన్నారు. ఆయన 10 రోజులుగా ఇదే లైన్‌లో ఉన్నారు.

''గత గురువారం నుంచి నేను ఇందులోనే నిద్రపోతున్నా. ఇది చాలా కష్టంగా ఉంది. కానీ, నేనేం చేయగలను. ఇంత కష్టపడినప్పటికీ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కూడా నాకు దొరకదు'' అని ఆయన బీబీసీకి చెప్పారు.

పర్యాటకుల కోసం ప్రీతమ్ వాహనాన్ని నడుపుతుంటారు. గతంలో పర్యాటకులను ఆయన దేశమంతటా తిప్పేవారు. కానీ, ఇప్పడు ఆయన సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్లడం లేదు. కేవలం ఎయిర్‌పోర్ట్‌కు మాత్రమే రాకపోకలు జరుపుతున్నారు.

పది రోజుల పాటు లైన్‌లో ఉండి కొనుగోలు చేసిన పెట్రోల్‌తో ఆయన కేవలం మూడు ట్రిప్పులు మాత్రమే ప్రయాణం చేయగలరు. ఆ తర్వాత, మళ్లీ పెట్రోల్ కోసం లైన్ కట్టాల్సిందే.

లైన్‌లో ఉన్న సమయంలో అప్పుడప్పుడు ఆయన కుమారుడు లేదా సోదరుడు వాహనంలో కూర్చుంటే ఆయన ఇంటికి వెళ్లి మిగతా పనులు చేసుకుంటారు. లైన్‌లో ఉన్న మిగతావారికి ఈ అవకాశం కూడా లేదు.

ఆయన వెనకాలే చాలా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. ఒక బస్సు కండక్టర్ గుణ, డ్రైవర్ నిషాంత ఇళ్లు చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి, వారు పబ్లిక్ వాష్‌రూమ్‌లపైనే ఆధారపడాల్సి వచ్చింది.

''నేను, మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నా. టాయ్‌లెట్ వెళ్లాలంటే 20 రూపాయలు, స్నానానికి 80 రూపాయలు ఖర్చు అవుతుంది'' అని గుణ చెప్పారు.

కండక్టర్ గుణ (ఎడమ), డ్రైవర్ నిషాంత (కుడి) పబ్లిక్ వాష్‌రూమ్‌లపైనే ఆధారపడుతున్నారు

'ఇది చాలా భయంకరం'

ఆహార ధరల పెరుగుదలతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పడు అక్కడ ద్రవ్యోల్బణం 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇంధనం కోసం వారు లైన్లు కట్టడం ప్రారంభించినప్పటి నుంచి దేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు జరిగాయి. కోపోద్రిక్తులైన వేలాదిమంది ప్రజలు నిరసన చేస్తూ వీధుల్లోకి రావడంతో అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశాన్ని వదలాల్సి వచ్చింది. తర్వాత ఆయన పదవికి రాజీనామా కూడా చేశారు.

దేశం ఎదుర్కొంటోన్న ఈ భయంకరమైన ఆర్థిక సంక్షోభానికి, కోవిడ్-19 మహమ్మారి కారణంగా పర్యాటక రంగం కుదేలవడం కూడా కొంతవరకు కారణంగా చెప్పొచ్చు. కానీ పన్నులు తగ్గించడం, రసాయన ఎరువుల వాడకంపై నిషేధం విధించడం లాంటి ప్రభుత్వం తీసుకున్న వినాశకరమైన వరుస ఆర్థిక విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం కలిగించాయని విశ్లేషకులు అంటున్నారు.

శ్రీలంకలో ఇప్పుడు విదేశీ నిల్వలు ప్రమాదకర స్థాయిలో క్షీణించాయి. చమురు, ఔషధాలు, కొన్ని రకాల ఆహారపదార్థాల దిగుమతుల చెల్లింపులకు విదేశీ కరెన్సీ అవసరం.

ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని ముట్టడించే నిరసనల్లో ఒక దశలో తాను కూడా పాల్గొన్నట్లు కండక్టర్ గుణ చెప్పారు.

''ఆయన జీవన విధానం చూసి నేను ఆశ్చర్యపోయా. అక్కడున్న ఒక మెత్తటి కుర్చీలో కూర్చున్నప్పుడు నా జీవితానికి, ఆయన అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితానికి మధ్య ఉన్న అంతరం అర్థమైంది'' అని బీబీసీతో గుణ అన్నారు.

అదే లైన్‌లో కాస్త వెనక్కి వెళ్తే వరుసకి అన్నదమ్ములయ్యే వ్యక్తుల బృందం ఉంది. అందులో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా మిగతావారు బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారు. వారంతా ఒక ప్రణాళిక ప్రకారం లైన్‌లో ఎదురు చూస్తున్నారు. వారిలో కొంతమంది రాత్రిళ్లు ఇంటికి వెళ్లగా, మిగతా వారు దొంగల నుంచి తమ వాహనాలను కాపాడుకోవడం కోసం కార్లలోనే నిద్రిస్తారు.

''ఇది చాలా భయంకరం. మాటల్లో ఈ బాధను చెప్పలేను'' అని బీబీసీతో ఎవాంత అన్నారు.

ఆయన కారులో కూర్చొని లేదా దగ్గర్లో ఉన్న కాఫీ షాపుల్లో కూర్చొని ల్యాప్‌టాప్‌తో పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

కొంతమంది అక్కడ తరచుగా గొడవలు, వాగ్వాదాలు జరుగుతున్నాయని చెప్పగా, ఎవాంత మాత్రం అక్కడి ప్రజల్లోని స్నేహభావాన్ని పొగిడారు.

ఉదాహరణకు స్థానిక వ్యాపారస్థులు, వారి బాత్రూమ్‌లను వాడుకునేందుకు తమను అనుమతిస్తున్నారని ఎవాంత చెప్పారు.

నేరాలు చేసేవారు కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారని ఆయన అన్నారు. ''ఒకసారి నేను బయటే చెప్పులు వదిలిపెట్టి కారులో నిద్రపోయా. నేను లేచేసరికి చెప్పులు లేవు. కానీ, వాటి స్థానంలో ఆ దొంగ తన పాత, చిరిగిపోయిన చెప్పులను నా కోసం వదిలిపెట్టి వెళ్లిపోయాడు'' అని ఆయన నవ్వుతూ చెప్పారు.

రణిల్ విక్రమసింఘేను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా నియమించడంపై మిగతా ప్రజల్లాగే ఎవాంత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఆయన మరో రాజపక్ష'' అని మరో గ్రూపుకు చెందిన యూనస్ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు.

శ్రీలంకలో ఇంధనం కోసం వాహనాలు భారీగా లైన్లు కట్టడం సాధారణంగా మారిపోయింది

'సమయం వృథా'

అధ్యక్షునిగా విక్రమసింఘేను తాము అంగీకరించబోమని నిరసనకారులు పట్టుబడుతున్నప్పటికీ, వచ్చేవారం పార్లమెంట్ ఆయన పేరునే ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. మిగతా రాజకీయ నాయకులు కూడా అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపుతున్నారు.

అధ్యక్ష బాధ్యతలు ఎవరూ స్వీకరించినా, ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించడం వారికి చాలా పెద్ద సవాలే. ఐఎంఎఫ్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, దేశంలోకి చమురును దిగుమతి చేసుకోవడం ప్రస్తుతం వారి ముందున్న ప్రాధాన్యాలు.

క్యూ చివర్లో జీవిత బీమా కంపెనీలో పనిచేసే చంద్ర ఉన్నారు. ఆయన మరోవారం పాటు తన కారులోనే ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఆయన కారులో కొద్దిగా మాత్రమే పెట్రోల్ ఉంది. దీంతో ఆయన కారును ముందుకు నెట్టాల్సి రావొచ్చు.

''నేను నా సమయాన్ని వృథా చేసుకుంటున్నా'' అని బీబీసీతో ఆయన నిరాశగా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sri Lanka: "Standing in line for 10 days for petrol...sleeping in car"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X