అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్న కీలక నేత.. అనూహ్య పరిణామాలు
కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకొన్న శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఆ దేశాధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయిన వేళ.. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఈ పరిణామాలు సంభవించాయి. ఎన్నికలను మరింత ఆసక్తికరంగా, అంతకంటే ఉత్కంఠభరితంగా మార్చివేశాయి. సుదీర్ఘకాలంగా జంట సంక్షోభాలతో చిక్కుకొన్న ద్వీప దేశాధ్యక్షుడి ఎన్నికల రేసు దాదాపుగా పోటీ లేకుండా పోయినట్టే కనిపిస్తోంది.
సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస.. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో- తన ప్రత్యర్థి, శ్రీలంక పోడుజన పెరమున ఎంపీ దుల్లాస్ అలహప్పెరుమకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

సాజిత్ ప్రేమదాస.. శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవేగయకు సారథ్యాన్ని వహిస్తోన్నారు. జంట సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించలేక గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవడం, అనంతరం తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామల తరువాత ఈ ఎన్నికలు అవసరం అయ్యాయి. ప్రస్తుతం రణిల్ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకొనడానికి బుధవారం పోలింగ్‌ను నిర్వహించాల్సి ఉంది.
ఈ ఎన్నికల్లో సాజిత్ ప్రేమదాస సహా మరికొందరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాజాగా ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. తాను పోటీ చేయట్లేదంటూ ప్రకటించారు. శ్రీలంక పోడుజన పెరమున ఎంపీ దుల్లాస్ అలహప్పెరుమకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో దుల్లాస్ అలహప్పెరుమ గెలవడానికి అవకాశాలు మెరుగుపడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
For the greater good of my country that I love and the people I cherish I hereby withdraw my candidacy for the position of President. @sjbsrilanka and our alliance and our opposition partners will work hard towards making @DullasOfficial victorious.
— Sajith Premadasa (@sajithpremadasa) July 19, 2022
రాజకీయాల్లోకి రాకముందు అలహప్పెరుమ జర్నలిస్ట్‌గా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడీ సంక్షోభ పరిస్థితుల మధ్య జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. సాజిత్ ప్రేమదాస వంటి బలమైన నాయకుడు, సమగి జన బలవేగయ పార్టీ ఆయనకు మద్దతు ప్రకటించడం వల్ల అలహప్పెరుమ గెలిచే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications