చూస్తే గుండె ఆగిపోయే వింత మ్యూజియం ఇదే! అత్యంత భయానకమైన జంతువులు
సాధారణంగా జూకి వెళ్తే ఏం చూస్తాం? సింహాలు, పులులు, కోతులు బోనుల్లో ఉంటే.. మనం బయట నిలబడి చూస్తాం. కానీ, నెదర్లాండ్స్ రాజధాని అంస్టర్‌డామ్‌లో కొత్తగా వెలిసిన ఒక 'ఆర్ట్ జూ' (Art Zoo)కి వెళ్తే కథ అడ్డం తిరుగుతుంది. అక్కడ మనుషులు బోనుల్లో ఉంటే, క్రూర మృగాలు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. వినడానికే వింతగా ఉంది కదూ! ఈ మధ్య రీల్స్ లో కూడా ఏఐ వీడియోల్లో ఇలాంటివి మన చూస్తూనే ఉన్నాం. కానీ ఇది నిజమైతే ఎలా ఉంటుందనేది కళ్లకు కట్టిన్నట్లు చూడాలంటే మాత్రం అంస్టర్‌డామ్ ఆర్ట్ జూకు వెళ్లాల్సిందే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఇది నిజమైన జూ కాదు కానీ, చనిపోయిన జంతువుల చర్మాలతో తయారు చేసిన బొమ్మల మ్యూజియం. ఇక్కడికి వెళ్లిన వారికి ఒక సరికొత్త, కొంత భయానకమైన అనుభూతి కలుగుతోంది.
గాల్లో వేలాడే మొసలి.. నక్కిన చిరుత!
మీరు ఈ మ్యూజియంలోకి అడుగు పెట్టగానే, తలపైకి ఎత్తి చూస్తే చాలు.. గుండె గుభేల్మంటుంది. సుమారు 12 అడుగుల భారీ మొసలి, నోరు తెరుచుకుని మిమ్మల్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గాల్లో వేలాడుతూ కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే, ఒక గోడ సందులో చిరుతపులి నక్కి కూర్చుని ఉంటుంది. దాన్ని చూడగానే మీకు ప్రాణ భయంతో చెమటలు పట్టడం ఖాయం. ధైర్యంగా రెండుగులు ముందుకు వేస్తే ఒక నిప్పుకోడి తీక్షణంగా మిమ్మల్నే చూస్తూ కనిపిస్తుంది. ఇవే కాకుండా వందలాది రకాల జంతువులు, పక్షులు, వింత చేపల ఆకారాలు ఇక్కడ కొలువుదీరాయి.

నాచురల్ హిస్టరీ మ్యూజియం కాదు.. ఇదొక 'ఆర్ట్'!
ఇది మామూలు నాచురల్ హిస్టరీ మ్యూజియం కాదు. అక్కడ జంతువులు అడవిలో ఎలా ఉంటాయో అలాగే చూపిస్తారు. కానీ, ఈ 'ఆర్ట్ జూ'ని సృష్టించిన డచ్ కళాకారులు జాప్ సింకే, ఫెర్రీ వాన్ టోంగెరెన్ మాత్రం జంతువులకు కొంత 'డ్రామా'ను జోడించారు. జంతువుల హావభావాలను, అవి ఉండే భంగిమలను చాలా ఆర్టిస్టిక్‌గా, కొంత భయపెట్టేలా రూపొందించారు. 16, 17వ శతాబ్దాల్లో యూరప్ సంపన్నులు తమ ఇళ్లలో వింత వస్తువులను దాచుకునే 'వండర్‌కామర్స్' స్పూర్తితో దీనిని తయారు చేశారు.
బోనులో మనుషులు.. జంతువులు ఫ్రీ!
ఈ మ్యూజియం యొక్క అత్యంత వింతైన నియమం ఏంటంటే, సందర్శకులు బోనుల్లో ఉండాలి. జంతువులను ఉంచిన ప్రదర్శన గదుల చుట్టూ నల్లటి లోహపు బోనులు ఏర్పాటు చేశారు. సందర్శకులు ఆ బోనుల్లో నిలబడి, బయట స్వేచ్ఛగా ఉన్నట్లు కనిపించే జంతువులను చూడాలి. "మనుషులందరూ బోనులో ఉండి, జంతువులన్నీ స్వేచ్ఛగా ఉంటే ఆ ఫీలింగే వేరు. అలా ఈ మొత్తం భవనం ఒక పెద్ద కళాఖండంగా మారుతుంది" అని టోంగెరెన్ చెప్పారు. ఇది సందర్శకులకు కొంత భయానక అనుభూతిని ఇస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు.
అన్నీ చనిపోయిన జంతువులే.. చట్టబద్ధంగానే సేకరణ!
ఈ ప్రదర్శనలో ఉన్న జంతువులేవీ అడవి నుంచి పట్టుకొచ్చినవి కావు. అన్నీ జూలలో సహజ కారణాలతో చనిపోయినవే. సింకే మాట్లాడుతూ, "మా జంతువులన్నీ జూల నుంచి వచ్చినవి. అవి చనిపోయాక, వాటి చర్మాలను చట్టబద్ధంగా సేకరించి, వాటి చరిత్రను తెలుసుకున్నాకే ఈ బొమ్మలను తయారు చేశాం" అని స్పష్టం చేశారు. ఐరోపాలోని వివిధ జూల నుంచి వీటిని సేకరించడం వల్ల వాటి చట్టపరమైన పత్రాల నిర్వహణ సులభమైందని వారు తెలిపారు.
డార్విన్ స్పూర్తితో.. వింత సముద్ర రాక్షసులు!
ఈ కళాకారులు తమను తాము ఒక కళాత్మక త్రయం (trio)గా భావిస్తారు. చార్లెస్ డార్విన్‌ను తమ మూడవ భాగస్వామిగా పరిగణిస్తారు. డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతం, ప్రకృతి పట్ల ఆయనకున్న కుతూహలం వీరికి ప్రేరణ. మ్యూజియంలో ఒక గోడపై డార్విన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. జంతువులే కాకుండా, 16వ శతాబ్దంలో నావికులు తయారు చేసిన వింతైన 'సముద్ర రాక్షసుల' బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి.














Click it and Unblock the Notifications
