హర్మూజ్ ను దాటిన అమెరికా యుద్ధనౌకలు.. ఇదే తొలిసారి..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి కాస్త తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అటు ఇరాన్, ఇటు అమెరికా బృందాలు ఇస్లామాబాద్ కు చేరుకున్నాయి. ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాకిస్థాన్ ప్రతినిధులు విడివిడిగా చర్చలు నిర్వహించారు. ఆ తర్వాత మూడు దేశాల మధ్య త్రైపాక్షిక చర్చలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ రాత్రి లేదా రేపు మరోసారి ఈ మూడు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి.
ఈ తాజా పరిణామాల మధ్య హార్మూజ్ జలసంధి వద్ద ఆసక్తికర పరిణామం జరిగినట్లు సమాచారం. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు హార్మూజ్ జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన నౌకలు హార్మూజ్ జలసంధిని దాటడం ఇదే మొదటిసారి. ఇందులో రెండు అమెరికన్ గైడెడ్- మిస్సైల్ డిస్ట్రాయర్లు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ఈ యుద్ధ నౌకల ప్రయాణం గురించి ఇరాన్ అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. ఇది కేవలం నేవిగేషన్ స్వేచ్ఛ కోసం చేపట్టిన చర్య అని అమెరికా అధికారి పేర్కొన్నారు. మరోవైపు అమెరికా యుద్ధ నౌకలు హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించలేదని ఇరాన్ మీడియా స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ఓ అమెరికన్ డిస్ట్రాయర్ హార్మూజ్ జలసంధి వైపు వస్తుండగా.. తాము హెచ్చరిక జారీ చేయడంతో అది వెనుదిరిగిందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications