చైనాకు షాకిచ్చిన తైవాన్ ప్రజలు: అధ్యక్ష ఎన్నికల్లో డీపీపీ అభ్యర్థి లై చింగ్ తేకి పట్టం
తైపీ: తైవాన్ ఆక్రమణకు కుట్రలు పన్నుతున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. చైనా చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా.. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి మూడోసారి పట్టం కట్టారు ప్రజలు. డీపీపీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తైవాన్ ఉపాధ్యక్షుడు లాయ్ చింగ్ తె విజయం సాధించారు. ఆయనతో తలపడిన ప్రతిపక్ష పార్టీల నేతలు కువోమింగ్ తాంగ్ పార్టీకి చెందిన హు యు ఇయ్, తైవాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కోవెన్ జి ఓటమిని అంగీకరించారు.
శనివారం ఉదయం 8 నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4కు ముగిసింది. అనంతరం ఓట్ల లెక్కింపు జరిగింది. రాబోయే నాలుగేళ్ళలో చైనాతో సంబంధాలను నిర్దేశించే ఎన్నికలు కావటంతో తైవాన్ ప్రజలు అధికార డీపీపీ వైపు మళ్లీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

అధికార పక్షం-డీపీపీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన లాయ్ చింగ్ తెను వ్యతిరేకించిన చైనా.. యుద్ధం కావాలా లేక శాంతి కావాలా తేల్చుకోవాలంటూ చేసిన హెచ్చరికలను తైవాన్ ప్రజలు నిర్ధ్వందంగా తోసిపుచ్చినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తైవాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
తైవాన్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ కొన్నేళ్లుగా వాదిస్తోన్న విషయం తెలిసిందే. తరచూ ఈ ద్వీప దేశం చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు చేపడుతూ బెదరింపులకు దిగుతోంది. ఈ మధ్యే తైవాన్ను విలీనం చేసుకునేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది చైనా. అయితే, తైవాన్ ప్రస్తుత అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్, ఉపాధ్యక్షుడు లాయ్ చింగ్‌లు తైవాన్‌పై బీజింగ్ సార్వభౌమాధికార వాదనలను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, తైవాన్‌కు అండగా నిలుస్తూ వస్తోంది అమెరికా.












Click it and Unblock the Notifications