కాబుల్‌ను కమ్ముకున్న తాలిబన్లు: జలాలాబాద్‌లోనూ పాగా: మిగిలింది రాజధాని ఒక్కటే
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు విజృంభణకు అడ్డు అదుపు ఉండట్లేదు. వారి దాడి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా ఒక్కొక్క నగరాన్నీ తమ వశం చేసుకుంటూ వస్తోన్న తాలిబన్లు.. రాజధాని కాబుల్‌ను కమ్మేస్తోన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పట్టు పెంచుకుంటోన్నారు. ఇప్పటిదాకా దాదాపు అన్ని రీజియన్లలోనూ పాగా వేశారు. ఆయా ప్రావిన్సుల రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు. దేశ రాజధాని కాబుల్‌ను చుట్టుముట్టారు. దాన్ని కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చంటూ వార్తలు వెలువడుతోన్నాయి.
Recommended Video

జలాలాబాద్ కూడా
తాజాగా తాలిబన్లు.. మరో ప్రధాన నగరం జలాలాబాద్‌ను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. నంగర్‌హర్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్. ఆప్ఘనిస్తాన్ ఈశాన్య ప్రాంతంలోని అతిపెద్ద నగరం ఇది. మజర్-ఐ-షరీఫ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబన్ల ఖాతాలో పడిన మరో సిటీ ఇది. ప్రభుత్వ బలగాలు చేతులెత్తేయడంతో పెద్దగా పోరాడాల్సిన పరిస్థితి లేకుండానే తాలిబన్లు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నారు. తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మిగిలింది రాజధాని ఒక్కటే..
తాలిబన్ల వశం కావాల్సిన ఏకైక అతిపెద్ద నగరం రాజధాని కాబుల్ ఒక్కటే. ఇప్పటికే కాందహార్, హెరాత్, ఫైజాబాద్, పుల్-ఐ-ఖుమ్రీ, ఫరా, మజర్-ఐ-షరీఫ్, కుందుజ్, సార్-ఐ-పుల్ వంటి నగరాలన్నీ వారి వశం అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలపై తమ జెండా ఎగురవేశారు. ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిదులు జలాలాబాద్‌ను ఖాళీ చేసి కాబుల్‌కు వెళ్లిపోయారు. ఈశాన్యం, ఉత్తరం, పశ్చిమ ప్రాంతాల్లో దాదాపు అన్ని ప్రావిన్సుల్లో తాలిబన్లు తమ జెండాను పాతేశారు. ఆ ప్రావిన్సుల రాజధానులన్నీ తమ వశమైనట్లు ప్రకటించుకున్నారు.

సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న తాలిబన్లు..
తమ ఆధీనంలోకి వచ్చిన ప్రావిన్సుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఇదివరకు 10 ప్రావిన్సుల్లో తాలిబన్ల పాలన ఆరంభమైంది. అఫ్గానిస్తాన్ ఉత్తర ప్రాంతంలోని ఫైజాబాద్, పుల్-ఐ-ఖుమ్రీ, పశ్చిమ ప్రాంతంలోని ఫరా నగరాలు తాలబన్ల సొంతం అయ్యాయి. ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగులందరినీ అక్కడి నుంచి తరిమి కొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ సొంతం చేసుకున్నారు. ఘాజ్నీ, లష్కర్ గాహ్, ఫైజాబాద్, పుల్-ఐ-ఖుమ్రీ, కుందుజ్, సార్-ఐ-పుల్, తలోకాన్ పట్టణాలు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లాయి.

పాకిస్తాన్ వెళ్లే మార్గాలు క్లోజ్
కాబుల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే నగరం జలాలాబాద్.. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. సరిహద్దులను దాటుకుని వెళ్తే పెషావర్‌కు చేరుకోవచ్చు. కాబుల్ నుంచి పాకిస్తాన్‌లోని ఈ ప్రధాన నగరానికి చేరుకోవాలంటే జలాలాబాద్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి నగరాన్ని తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జలాలాబాద్ మీదుగా పాకిస్తాన్ సరిహద్దులకు దారి తీసే అన్ని మార్గాలనూ తాలిబన్లు మూసివేశారు.

ఉజ్బెకిస్తాన్ సరిహద్దుల నుంచి
ఉజ్బెకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న అతిపెద్ద నగరం మజర్-ఐ-షరీఫ్‌ను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ సమీపంలోని జలాలాబాద్‌ను సొంతం చేసుకోవడం తాలిబన్ల దూకుడుకు అద్దం పడుతోంది. ఈ రెండు నగరాలు పశ్చిమ, తూర్పు రీజియన్లలో ఉంటాయి. రెండు వేర్వేరు దిక్కుల్లో ఉన్న ఈ రెండింటినీ అతి తక్కువ కాలంలో తమ నియంత్రణలోకి తెచ్చుకోవడాన్ని బట్టి చూస్తే.. తాలిబన్లు ఏ స్థాయిలో రెచ్చిపోతోన్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఉజ్బెకిస్తాన్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటందీ మజర్-ఐ-షరీఫ్ సిటీ.

కాబుల్‌కు అతి సమీపంలోకి..
కాగా- తాలిబన్లు క్రమంగా కాబుల్‌కు అతిసమీపానికి చేరుకుంటోన్నాయి. కాబుల్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోగార్ ప్రావిన్స్ రాజధాని పుల్-ఇ-ఆలమ్ నగరాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోన్నాయి. ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ బలగాలు వారిని అడ్డుకుంటోన్నాయి. పుల్-ఇ-ఆలమ్ నుంచి పెద్ద ఎత్తున కాల్పుల శబ్దం వినిపిస్తోన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నగరం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్తే.. కాబుల్‌ను ఆక్రమించుకోవడం లాంఛనప్రాయమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

కాబుల్ చుట్టూ భద్రతా బలగాలు
కాగా- రాజధాని కాబుల్‌కు తాలిబన్లు సమీపించడంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. కాబుల్ చుట్టూ మోహరించాయి. కొత్తవారినెవరినీ నగరంలోకి రానివ్వట్లేదు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అమర్చారు. తనిఖీలను ముమ్మరం చేశారు. కాబుల్ ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోని ఉందని అల్ జజీరా మీడియా తెలిపింది. కాబుల్ నగరానికి దారి తీసే అన్ని మార్గాలనూ మూసివేశారని, ఆయా పోస్టుల వద్ద అడుగడుగునా భదత్ర బలగాలను మోహరింపజేసినట్లు పేర్కొంది.

కాబుల్‌కు తాకిడి..
తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రావిన్సుల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రాజదానికి చేరుకుంటోన్నారని, వారిని తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తోన్నారని అల్ జజీరా తెలిపింది. భద్రతా బలగాలు అనుమానితులను అదుపులోకి తీసుకుంటోన్నాయని పేర్కొంది. నిత్యావసర సరుకులు, ఆహారం, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయని స్పష్టం చేసింది. జలాలాబాద్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకుంటారని, అక్కడి ప్రభుత్వ బలగాలు ప్రతిఘటించకుండా లొంగిపోతాయని కాబుల్ నివాసులు ఎవరూ ఊహించలేదని పేర్కొంది.

విదేశీయుల ఖాళీ వేగవంతం..
మరోవంక- అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు.. తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేయడాన్ని వేగవంతం చేశాయి. రాయబార కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబీకులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు పూర్తి చేశాయి. వారికి రక్షణగా అమెరికా 1000 మంది సైనికులను అక్కడ మోహరింపజేసింది. ఉద్యుగులు, అమెరికా పౌరులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా తరలించే చర్యల్లో వారు పాల్గొంటోన్నారు. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను కాబుల్‌కు పంపిస్తామని అమెరికా తెలిపింది. అదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి బ్లింకెన్.. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications