మరో'తుగ్లక్ ఫర్మానా': తాలిబన్ కఠిన నిర్ణయం!
Internet Shutdown: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ తుగ్లక్ ఫర్మానా జారీ చేసింది. తాలిబన్ పాలన మొదలైనప్పటి నుంచి ప్రజలపై అనేక ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అఫ్గాన్ పౌరుల కష్టాలను మరింత పెంచింది.
అఫ్గానిస్తాన్‌లో సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్
అఫ్గానిస్తాన్‌లో సెప్టెంబర్ 29న సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ మొదలైంది. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను కట్ చేయడంతో పాటు దేశంలోని మొబైల్ నెట్వర్క్‌లు కూడా పనిచేయడం ఆగిపోయాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్‌బ్లాక్స్(NetBlocks) ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇప్పుడు సాధారణ స్థాయి కన్నా ఒక శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీనిని సంపూర్ణ బ్లాక్‌అవుట్‌గా ప్రకటించారు.

ఇంటర్నెట్ నిలిపివేతకు కారణం ఏమిటి?
తాలిబన్ ప్రభుత్వం ఈ చర్యను దేశంలో నైతికతను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా చూపిస్తోంది. ఇంటర్నెట్ ద్వారా 'అనైతిక, అశ్లీల కంటెంట్' వ్యాప్తి చెందుతోందని.. ఇది ఇస్లామిక్ షరియా చట్టాలకు విరుద్ధమని తాలిబన్ ఆరోపిస్తోంది. ఈ కారణంగానే దేశంలో ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది.ఇంటర్నెట్‌తో పాటు ప్రస్తుతానికి కాలింగ్ సేవలను కూడా నిలిపివేశారు.
పౌరులపై తీవ్ర ప్రభావం
తాలిబన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది పౌరులకు అపారమైన ఇబ్బందులను కలిగిస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించడంతో దేశ ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ చర్య దేశ పౌరుల, ముఖ్యంగా మహిళల హక్కులు, వారి గొంతును అణచివేయడానికి దారితీస్తుందని, మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమాచారానికి దూరం కావడంతో ఆఫ్ఘన్ పౌరుల కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications