తాలిబన్ సర్కార్ లో తొలి ఫత్వా జారీ- స్కూళ్లలో కో ఎడ్యుకేషన్ నిషేధం-అన్ని అనర్ధాలకు మూలం
ఆప్ఘనిస్తాన్ లో దురాక్రమణతో పాలనా పగ్గాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఆ లోపే దేశంలో పరిస్దితుల్ని తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మాట వినని వారిపై ఇప్పటికే కాల్పులు జరిపి హతమారుస్తున్న తాలిబన్లు.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చాక ఇవాళ తొలి ఫత్వా జారీ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కో ఎడ్యుకేషన్ ను నిషేధిస్తూ తాలిబన్లు ఇవాళ ఫత్వా జారీ చేశారు. దేశంలోని అన్ని విద్యాసంస్ధలు, యూనివర్శిటీలు, పాఠశాలల్లో కో ఎడ్యుకేషన్ ను నిషేధించారు. అన్ని ప్రభుత్వ , ప్రైవేటు విద్యాసంస్ధల అధికారులతో ఇవాళ సమావేశమైన తాలిబన్ నేతలు.. ఈ మేరకు ఫత్వా జారీ చేశారు. ఆప్ఘన్ పగ్గాలు తీసుకున్న తర్వాత తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే కావడం విశేషం.

ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళల హక్కుల్ని కాపాడతామని, ప్రభుత్వంలో వారికి చోటు కల్పిస్తామని చెప్పిన తాలిబన్లు ఇవాళ యూటర్న్ తీసుకున్నట్లు తాజా ఫత్వా ద్వారా వెల్లడైంది. దేశంలో అన్ని అనర్ధాలకు విద్యాసంస్ధల్లో కో ఎడ్యుకేషనే కారణమని ఆరోపిస్తూ తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రెండు దశాబ్దాల క్రితం ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాకముందు తాలిబన్లు ఈ ఫత్వా జారీ చేశారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికార పగ్గాలు చేపడుతున్న నేపథ్యంలో అధికారికంగా ఈ నిర్ణయాన్నిు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుపుతున్న అన్ని విద్యాసంస్ధల్లోనూ కో ఎడ్యుకేషన్ నిషేదిస్తూ తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. దీన్ని ఉల్లంఘించిన వారికి తాలిబన్లు వారి శైలిలో శిక్షలు అమలు చేస్తారు. ఈ విషయాన్ని యూనివర్శిటీల ప్రొఫెసర్లు, విద్యాసంస్ధల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి తెలిపారు. దీన్ని అమలు చేయకపోతే తలెత్తబోయే పరిస్దితులపైనా వారు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్ల హెచ్చరికలతో తమ విద్యాసంస్ధల్లో ఈ నిర్ణయం అమలు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications