భారతీయులకు గుడ్‌న్యూస్: వీసా లేకుండానే థాయ్‌లాండ్‌లో పర్యటించొచ్చు
బ్యాంకాక్: శ్రీలంక తర్వాత భారతీయులకు థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్- తైవాన్ దేశాల నుంచి వచ్చేవారు వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు థాయ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో భారతీయులు వీసా లేకుండానే థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయ్‌లాండ్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రధాని శ్రేత్తా తవిసిన్ తెలిపారు.

భారత్, తైవాన్ నుంచి వచ్చేవారు వీసా లేకుండానే 30 రోజులపాటు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు అని థాయ్ అధికార ప్రతినిధి చాయ్ పచరొంకే తెలిపారు. కాగా, గత నెలలోనే చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయ్‌లాండ్ వీసా మినహాయింపును ఇచ్చింది.
మలేషియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయ్‌లాండ్ కు వెళుతుంటారు. థాయ్ పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు సుమారు 22 మిలియన్ల మంది థాయ్‌లాండ్‌లో పర్యటించారు. వీరి వల్ల సుమారు 25.67 బిలియన్ డాలర్ ఆదాయం లభించిందని ఆ గణాంకాలు వెల్లడించాయి. థాయ్‌లాండ్‌లో చూడదగిన ప్రదేశాల్లో బ్యాంకాక్, క్రబి, పుకెట్, పిఫీ దీవులు ముందువరుసలో ఉంటాయి. ఇక రకరకాల ఆహార పదార్థాలు, నైట్ క్లబ్‌లు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు.
కాగా, కొద్ది రోజుల క్రితమే శ్రీలంక కూడా భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. భారత్ తోపాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాండ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2024, మార్చి 31 నుంచి ఈ సడలింపు అమలులో ఉంటుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో థాయ్ లాండ్ తోపాటు శ్రీలంకను కూడా వీసా లేకుండానే భారత పర్యటకులు సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications