మానవత్వం కలిపింది: పాక్‌కు థ్యాంక్స్, మోడీకి షరీఫ్ కూతురు
న్యూఢిల్లీ/లాహోర్: ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ షరీఫ్‌లు పరస్పరం థ్యాంక్స్ చెప్పుకున్నారు! యెమన్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి భారతీయులను మన దేశానికి తరలించింది/తరలిస్తోంది. వేలాది మందిని తరలించింది.
అయితే, పాకిస్తాన్ దేశం కూడా కొందరు భారతీయులను తీసుకు వచ్చింది. పాకిస్తాన్ పదకొండు మంది భారతీయులను యెమన్ నుండి తీసుకు వచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. బుధవారం ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
పాకిస్తాన్ సహకారంతో వచ్చిన భారత్‌కు చెందిన పదకొండు మంది సిటిజన్స్‌కు స్వాగతం పలుకుతున్నానని, ఇందుకు తాను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని, షరీఫ్‌దీ మానవతా దృక్పథమని కొనియాడారు.

సేవ చేసేందుకు ఎలాంటి హద్దులు (బార్డర్) ఉండదని ట్వీట్ చేశారు. యెమన్ నుండి బాధితులను తీసుకు వచ్చేందుకు ఎన్నో దేశాలు ముందుకు వస్తున్నాయని అది సంతోషమన్నారు.
మోడీ ట్వీట్ పైన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ షరీఫ్ స్పందించారు. మోడీ స్పందనకు అతనికి ధన్యవాదాలు అని, మా భారత స్నేహితులు భద్రంగా ఇంటికి చేరుకున్నారని, మానవత్వం మనలను ఒకటి చేస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications