వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ కుబేరుని కథ: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బెర్నార్ ఆర్నో

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు మైక్రో బ్లాగింగ్ సైట్ 'ట్విటర్’ను కొనుగోలు చేశాక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడు కాదు. ఆయన స్థానాన్ని ప్రజలకు పెద్దగా తెలియని ఒక వ్యక్తి ఆక్రమించారు.

ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ ప్రకారం... 171 బిలియన్ డాలర్ల (రూ. 14,11,143 కోట్లు) నికర సంపదతో ఫ్రాన్స్ వ్యాపారవేత్త బెర్నార్ ఆర్నో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద విలువ 164 బిలియన్ డాలర్లు (రూ. 13,53,615 కోట్లు). ఆయన రెండో స్థానానికి పడిపోయారు.

భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 125 బిలియన్ డాలర్ల (రూ. 10,31,675 కోట్లు) ఆస్తులతో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.

అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో, బిల్ గేట్స్ అయిదో స్థానంలో నిలిచారు.

అయితే, ప్రపంచ కుబేరునిగా అవతరించిన ఈ బెర్నార్ ఆర్నో ఎవరు? ఆయన అంత సంపదను ఎలా ఆర్జించారు?

బెర్నార్ ఆర్నో

బెర్నార్ ఆర్నో ఎవరు?

బెర్నార్ ఆర్నో ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త. ఆయన ఎల్‌వీఎస్‌హెచ్ గ్రూప్ చైర్మన్. ఈ గ్రూపులో 70కి పైగా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తులను విక్రయిస్తాయి.

ఈ గ్రూప్‌లో లగ్జరీ దుస్తులను విక్రయించే లూయిస్ విటన్, ఫెండీ కంపెనీలతో పాటు మేకప్ ఉత్పత్తుల విక్రయదారు ఫెంటీ బ్యూటీ, వైన్ కంపెనీ డామ్ పెరిగ్రెన్ తదితర కంపెనీలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఉత్పత్తులను విక్రయించే కంపెనీలుగా వీటికి పేరుంది.

ఇవే కాకుండా మార్క్ జాకబ్స్ నుంచి వర్జిల్ అబ్లో, రాఫ్ సిమన్స్, ఫీబీ ఫిలో వంటి ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ల కంపెనీలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

2019లో అమెరికా ప్రఖ్యాత జ్యూయెలరీ బ్రాండ్ 'టిఫానీ’ని కొనుగోలు చేసినప్పుడు బెర్నార్ ఆర్నో పేరు చర్చల్లో నిలిచింది.

ఆ సమయంలో ఆర్నో మొత్తం ఆస్తుల విలువ 106.9 బిలియన్ డాలర్లు (రూ. 8,74,860 కోట్లు). ఇది ఇప్పుడు 170 బిలియన్ డాలర్లను దాటింది.

బెర్నార్ ఆర్నో

లగ్జరీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్

అమెరికా మ్యాగజీన్ ఫోర్బ్స్ చెప్పినదాని ప్రకారం, బెర్నార్ ఆర్నోను ప్రపంచవ్యాప్తంగా 'మాడ్రన్ లగ్జరీ ఇండస్ట్రీ’ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు.

నేడు భారత్ నుంచి చైనా, అమెరికా, ఆఫ్రికా నగరాల్లోని ప్రజలు ఫ్రాన్స్ కంపెనీ లూయిస్ విటన్ సహా ఇతర బ్రాండ్లకు చెందిన దుస్తుల్ని ధరిస్తున్నారు.

ఈ లగ్జరీ పరిశ్రమను ప్రారంభించాలనే ఆలోచన కూడా బెర్నార్‌దేనని ఒక కథనంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఈ కథనం ప్రకారం, బెర్నార్ ఆర్నో తండ్రి నిర్మాణ రంగ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించారు. కుటుంబ యాజమాన్యంలోని దుస్తుల కంపెనీలతో ఒక గ్రూపును ఏర్పాటు చేస్తే అసమాన శక్తిగా ఎదగవచ్చని చాలా చిన్న వయస్సులోనే బెర్నార్ ఆర్నో గుర్తించారు. వెంటనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడ్డారు.

బెర్నార్ ఆర్నో

అమెరికాలో మెళకువలు , యూరప్‌లో ఆర్జన

బెర్నార్ ఆర్నో, అమెరికా వ్యాపార ప్రపంచంలో మెళుకువలు నేర్చుకొని వాటిని యూరప్‌లో ఉపయోగించారు.

మొదటగా 1985లో ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఒక దివాలా తీసిన టెక్స్‌టైల్ కంపెనీ 'బౌసెక్’ను ఆయన కొనుగోలు చేశారు.

ఫ్రాన్స్‌కు చెందిన 'డియా’ అనే పురాతన బ్రాండ్‌ను కూడా ఇందులో కలిపారు.

బెర్నార్ ఆర్నో చాలా వరకు బౌసెక్ ఆస్తులను విక్రయించారు. కానీ 'డియా’ బ్రాండ్‌ను మాత్రం వదల్లేదు.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, 1989లో ఆయన ఎల్‌వీఎంహెచ్‌ను టేకోవర్ చేశారు. దానికి 'ద వోల్ఫ్ ఇన్ ద కశ్మీర్ కోట్’ పేరు పెట్టారు.

బెర్నాస్ అర్నో

లగ్జరీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు

బెర్నార్ ఆర్నో తన కంపెనీ దుకాణాలను ఆధునిక షాపింగ్ స్టోర్‌లుగా మార్చారు. వాటిలో యూరప్ చరిత్ర, వారసత్వాన్ని జోడించారు.

ఈ బ్రాండ్లతో పాటు యువ ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి పని చేయడం ప్రారంభించారు. ఈ కారణంగా ఈ బ్రాండ్లు యువతను ఆకర్షించాయి.

క్రమంగా ఈ గ్రూపుకు చెందిన లగ్జరీ పర్సులు, బెల్ట్, షర్ట్‌లు సాంస్కృతిక బ్రాండ్‌గా రూపొందాయి.

అయితే, ఆయన బ్రాండ్‌కు తప్ప ఏ వ్యక్తిపై ఎప్పుడు పెద్దగా శ్రద్ధ చూపలేదు. అందుకే కొందరు ఆయనను 'మేథావి’ అని పిలుస్తుండగా, మరికొందరు 'సృజనాత్మక వ్యక్తుల దోపిడీదారు’ అని అంటారు.

ఆయనలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే, ఆయనెప్పుడూ నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలు చేసి వాటిలో పెట్టుబడులు పెట్టి వాటిని సొంతంగా డబ్బు ఆర్జించే స్థాయిలో నిలిపారు.

బెర్నార్ అర్నో

వ్యక్తిగత జీవితం

బెర్నార్ ఆర్నో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు.

ఆరు అడుగుల ఎత్తు ఉండే 73 ఏళ్ల బెర్నార్ ఆర్నోకు టెన్నిస్ ఆడటం, పియానో వాయించడం అంటే ఇష్టం.

న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ప్రకారం, తాను వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ లేదా నంబర్‌వన్ కాన్సర్ట్ పియానిస్ట్ కాలేకపోతున్నందున కనీసం తన కంపెనీనైనా వరల్డ్ నంబర్ వన్ కంపెనీగా నిలబెట్టాలని ఆర్నో ఒకసారి అన్నారు. కెనడా పియానిస్ట్ అయిన తన రెండో భార్య హెలెన్ మర్సియర్‌ను ఆకర్షించడం కోసం ఆయన పియానో వాయించారు.

ఆర్నో కళాత్మక వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. గోప్యతను పాటిస్తారు.

బ్లూమ్‌బెర్గ్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ప్రకారం, బెర్నార్ తన ప్రైవేట్ జెట్‌ను విక్రయించారు.

ట్విటర్‌లో కొంతమంది వ్యక్తులు బిలియనీర్ల ప్రైవేట్ జెట్‌లను ట్రాక్ చేస్తూ, వారి విమానాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను ఎత్తి చూపుతూ బహిరంగంగా విమర్శిస్తుంటారు.

బెర్నార్ ఆర్నో విషయంలో ఈ సమస్య మరింత ముఖ్యమైనదిగా మారింది. ప్రైవేట్ విమానాలను నిషేధించడం లేదా పన్నులు విధించాలని కొంతమంది రాజకీయనాయకులు ప్రతిపాదించారు.

తన గ్రూప్‌కు చెందిన రేడియో చానల్‌లో బెర్నార్ ఆర్నో మాట్లాడుతూ... ''ఇలాంటి కథనాలన్నింటి కారణంగా మేం మా గ్రూప్‌కు చెందిన ప్రైవేట్ విమానాన్ని విక్రయించాం. దీని ఫలితంగా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరూ చూడలేరు. ఎందుకంటే నేను ప్రైవేట్ విమానాన్ని వాడాల్సి వచ్చినప్పుడు అద్దెకు తీసుకుంటా’’ అని అన్నారు.

బ్లూమ్‌బర్గ్ చెప్పినదాని ప్రకారం ప్రస్తుతం ఎల్‌వీఎంహెచ్ గ్రూప్ మార్కెట్ విలువ 365.7 బిలియన్ డాలర్లు (రూ. 30,12,363 కోట్లు). యూరప్‌లో ఇదే అత్యధికం.

సీఈవో పదవికి నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని గతేడాది ఈ గ్రూప్ రద్దు చేసింది. దీని వల్ల అర్నార్ ఈ గ్రూప్‌కు 80 ఏళ్ల వరకు నాయకత్వం వహించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The story of the world's Kuber: Who is Bernard Arnault who pushed back Elon Musk?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X