
అబార్షన్లపై యూఎస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు: కలచి వేసింది..గుండె పగిలింది: జో బైడెన్
వాషింగ్టన్: అబార్షన్లపై అమెరికా అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువడించింది. ఈ తీర్పును ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ వ్యతిరేకించారు. శాడ్ డేగా అభివర్ణించారు. ఇదే అంతిమ తీర్పు కాబోదనీ వ్యాఖ్యానించారు. అబార్షన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న లక్షలాది మంది మహిళలు.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును స్వాగతించారు. పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. అమెరికా చరిత్రలో మరిచిపోలేని రోజుగా పేర్కొన్నారు.

రాజ్యాంగ హక్కులు తొలగింపు..
నిన్నటి వరకు అమెరికాలో అబార్షన్లనేవి రాజ్యాంగపరమైన హక్కు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. అబార్షన్లకు చట్టబద్ధత ఉండేది. 50 సంవత్సరాల నుంచీ ఇది మహిళల హక్కుగా వస్తోంది. 1973లో రో వర్సెస్ వేడ్ (Roe v Wade) కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. అమెరికాలో అబార్షన్లకు రాజ్యాంగ హక్కుగా ఉంటూ వస్తోన్నాయి. ఇప్పుడు ఈ హక్కును తొలగించింది సుప్రీంకోర్టు. ఇకపై దీనికి రాజ్యంగ హక్కుగా భావించకూడదని స్పష్టం చేసింది.

యూఎస్ సుప్రీంకోర్ట్ బెంచ్ ఇదే..
అయిదుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువడించింది. జస్టిస్ శామ్యుల్ అలిటో, జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ నీల్ గోర్సచ్, జస్టిస్ బ్రెట్ కవనాఫ్, జస్టిస్ అమి కొనో బార్రెట్‌తో కూడిన ఈ బెంచ్‌లో నలుగురు ఈ తీర్పుకు మద్దతు ఇచ్చారు. జస్టిస్ అలిటో దీన్ని వ్యతిరేకిస్తూ సంతకం చేశారు. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండటం వల్ల అబార్షన్లకు రాజ్యాంగ హక్కులను తొలగిస్తూ తీర్పు వెలువడింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
ఇకపై అబార్షన్ల విషయంలో రాష్ట్రాలు తమ సొంతంగా నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. రాష్ట్రాల గవర్నర్లు అబార్షన్లకు అనుమతి ఇచ్చేలా లేదా ఆంక్షలను విధించేలా సొంతంగా మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చని పేర్కొంది. రాజ్యంగపరమైన హక్కుగా దీన్ని గుర్తించట్లేదని స్పష్టం చేసింది. దీనిపై తుదినిర్ణయాన్ని ప్రజలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే తీసుకోవాలని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం అనేది ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉండదని, అందుకే ఈ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

వ్యతిరేకించిన జో బైడెన్..
ఈ తీర్పును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యతిరేకించారు. బాధాకరమైన రోజుగా అభివర్ణించారు. ఇది తనను తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించారు. మహిళల హక్కులను పరిరక్షించే విషయంలో తాము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే తుది తీర్పు కాదని అన్నారు. ఈ తీర్పు తనను నిర్ఘాంత పరిచిందని పేర్కొన్నారు. ఈ ఒక్క తీర్పుతో దేశం 150 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్టనిపిస్తోందని చెప్పారు.

స్వాగతించిన ఉద్యమకారులు..
ఈ తీర్పు పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని స్వాగతించారు. యాంటీ అబార్షన్ మూమెంట్ ప్రతినిధులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. కేక్ కట్ చేశారు. మహిళల ప్రాణాలను కాపాడే తీర్పుగా వారు పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రాలు కూడా అబార్షన్లపై ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దంటూ డిమాండ్ చేశారు.