ఇరాన్ యుద్ధంపై అమెరికా స్ట్రాటజిక్ స్టేట్ మెంట్- ఎపిక్ ఫ్యూరీ ఆగేది కాదు
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది. అయిదో రోజు కూడా దీనికి బ్రేకులు పడట్లేదు. ఈ యుద్ధానికి ఎపిక్ ఫ్యూరీగా పేరు పెట్టింది అమెరికా. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులపై అమెరికా తాజా ప్రకటన చేసింది. ఇరాన్ అణు కార్యక్రమంపై మూడు రౌండ్ల పాటు జరిగిన చర్చలు విఫలం కావడం వల్లే దాడులు చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది. అణ్వస్త్రాలను విడిచిపెట్టే విషయంలో ఇరాన్ ఎప్పుడూ కూడా నిజాయితీగా వ్యవహరించ లేదని పేర్కొంది. చివరి ప్రయత్నంగా చేపట్టి మూడో రౌండ్ సమావేశం కూడా విఫలం కావడంతో దాడులు తప్పలేదని, చర్చలు ముగిసిన అతి కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించినట్లు పేర్కొంది.

అణు కార్యక్రమాల నిలిపివేత కోసం అమెరికన్ దౌత్యవేత్తలు ఇరాన్ అధికారులతో ఒమన్, స్విట్జర్లాండ్‌లలో చర్చలు జరిపారు. రోజుల తరబడి ఈ చర్చలు కొనసాగాయి. దీన్ని నిలిపివేస్తే పలు రకాల ప్రోత్సాహకాలను కూడా అందిస్తామని అమెరికా అప్పట్లో వెల్లడించింది కూడా. షరతులను కూడా విధించారు. వీటికి ఇరాన్ తలొగ్గలేదు. దీంతో సమయం వృథా అని భావించినట్టుంది అమెరికా. మూడు రౌండ్ల చర్చల తర్వాత దీనికి పుల్ స్టాప్ పెట్టింది. ఆ తర్వాతే యుద్ధానికి దిగింది.
వాషింగ్టన్ వైట్ హౌస్ లో తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.. పెంటగాన్ అధికారులు. ఇరాన్‌పై చేపట్టిన దాడుల నేపథ్యాన్ని వివరించారు. ఆ మూడు రౌండ్ల చర్చలలో ఏమి జరిగిందో, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి ఎందుకు సీరియస్‌గా లేదో వారు స్పష్టం చేశారు. మొదటి రౌండ్ చర్చలు ఓ బెదిరింపుగా ఆరంభం అయ్యాయని, ఇరాన్ చర్చలకు నాయకత్వాన్ని వహించిన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి.. అణ్వాయుధాలు తమ హక్కుగా అభివర్ణించారని తెలిపారు.
60 శాతం శుద్ధి చేసిన సుమారు 460 కిలోగ్రాముల యురేనియం నిల్వలు ఇరాన్ వద్ద ఉన్నాయని, వీటి ద్వారా 11 అణు బాంబులను తయారు చేయవచ్చని అన్నారు. సైనిక చర్యతో సాధించలేని దాన్ని దౌత్యంతో ఎప్పటికీ సాధించనివ్వబోమని అరక్చి హెచ్చరించినట్లు వైట్ హౌస్, పెంటగాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ చర్చలు ఏ దిశగా సాగుతున్నాయనడానికి అరక్చి చేసిన ప్రకటనలే సాక్ష్యమని వ్యాఖ్యానించారు. రెండో విడత చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఓ డ్రాఫ్ట్ ను సమర్పించాలని నిర్ణయించినప్పటికీ.. దీన్ని ఇరాన్ ఉల్లంఘించిదని అన్నారు.












Click it and Unblock the Notifications