ఇమ్రాన్ ఖాన్ ఇక జీవితాంతం జైల్లోనే: తోడుగా భార్య: ఎన్నికల్లో పోటీకీ అనర్హుడు
Imran Khan: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ అధినేత, ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. ఊహించినట్టే- సంచలనం రేపిన సైఫర్ కేస్ ఆయనకు మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చింది ప్రత్యేక న్యాయస్థానం.
ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఇదే కేసులో దోషిగా తేలారు. వారిద్దరికీ 10 సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ మహ్మద్ జుల్కర్.. తుది తీర్పును వెలువడించారు.

ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు ఇమ్రాన్ ఖాన్. కొన్ని రహస్యాలను నిబంధనలకు వ్యతిరేకంగా వాషింగ్టన్‌లోని తమ దేశ రాయబారికి పంపించారని, సైఫర్ లీకులను చేరవేశారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.
దీని నుంచి తేరుకోకముందే మరో బిగ్ షాక్ తగిలిందాయనకు. మరో కేసులో కూడా ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలారు. అత్యంత వివాదాస్పదమైన తోషాఖానా కేసులో దోషిగా గుర్తించింది న్యాయస్థానం. 14 సంవత్సరాల కఠిన కారాగారశిక్షను విధించింది. ఇదే కేసులో ఆయన తొలి భార్య బుష్రా బీబీకి కూడా 14 సంవత్సరాల జైలు శిక్షను వర్తింపజేసింది.
అక్కడితో ఆగలేదు న్యాయస్థానం. 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏ రూపంలో అయినా ఇమ్రాన్ ఖాన్ పని చేయడానికి అనర్హుడని తేల్చింది. అలాగే- 787 మిలియన్ల జరిమానాను విధించింది. దీన్ని బట్టి చూస్తే- ఫిబ్రవరి 8వ తేదీన జరగబోయే పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీకి అనర్హుడని స్పష్టం చేసినట్టయింది.
వెంటవెంటనే రెండు కీలక కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలడం సంచలనం రేపింది. పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రకంపనలను పుట్టించింది. ప్రస్తుతం ఆయన పీటీఐ తరఫున సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు కేసుల్లో కలిపి 24 సంవత్సరాల పాటు జైలు శిక్షను ఎదుర్కొనాల్సి రావడం కలకలం సృష్టించింది
తాజా తీర్పులపై పీటీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్తామని తెలిపింది. ఫిబ్రవరి 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్‌పై అక్రమ కేసులను బనాయించి, రాజకీయంగా లబ్ది పొందాలని అధికార పార్టీ భావిస్తోన్నట్లు ఆరోపించింది.












Click it and Unblock the Notifications