స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్.. నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ సూసైడ్ కారు బాంబ్ స్కూల్ బస్సుపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 38 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ లోని సౌత్ వెస్టర్న్ బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఈ దారుణం జరిగింది.
బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని ఖుజ్ దార్ జిల్లాలో ఈ విషాదం జరిగినట్లు స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఇక్బాల్ పేర్కొన్నారు.

ఏ ఉగ్రవాద లేదా వేర్పాటువాద సంస్థ ఈ దాడికి పాల్పడిందో స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఘటనపై పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ మోహసీన్ నక్వీ సంతాపం తెలియ చేశారు. ఇదో పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని రాక్షసులుగా అభివర్ణించారు నక్వీ.
ఇటీవల బలూచిస్థాన్ ప్రావిన్స్ లో భారీ పేలుడు సంభవించింది. బాంబు పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలోనే మరో పేలుడు సంభవించడం ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య బలూచిస్థాన్ స్వాతంత్ర్య దేశంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications