భారత్ పై ఎవరైనా దాడి చేస్తే.. అమెరికా సైన్యం వస్తుంది: ట్రంప్ ప్రామిస్
ఫ్రాన్స్ లోని ఎవియన్ లో నిర్వహించిన 52 వ జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ భేటీలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్- అమెరికా మధ్య ప్రస్తుతం ఎలాంటి అధికారిక రక్షణ ఒప్పందం లేనప్పటికీ.. భారత్ ఎవరైనా దాడి చేస్తే తాము సైనిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నంత వరకూ అమెరికా నుంచి ఆ దేశానికి సపోర్ట్ ఉంటుందని పేర్కొన్నారు.
" చర్చల విషయంలో ప్రధాని మోదీ చాలా టఫ్. మోదీ చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. అతను ఏంజెల్ గా కనిపిస్తారు. అతను చాలా టఫ్.. అతను కిల్లర్. కానీ చాలా మంచివారు. భారత్ పై ఏదైనా మూడో దేశం ఎటాక్ చేస్తే మేము సాయం చేస్తాం. అమెరికా సైన్యం అక్కడ ఉంటుంది. మోదీ నాయకత్వం ఉన్నంత వరకూ అమెరికా సాయం చేస్తుంది. ఒకవేళ భారత్ కు కొత్త నాయకుడు వస్తే నాకు తెలియదు" అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఇక మోదీ నాయకుడిగా ఉన్నంతకాలం ప్రపంచ వేదికపై భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
అలాగే మోదీని గ్రేట్ ఫ్రెండ్ అంటూ ట్రంప్ అభివర్ణించారు. వాషింగ్టన్ లో ప్రధాని మోదీని గౌరవిస్తారని తెలిపారు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం వైట్ హౌజ్ లో ప్రధాని మోదీకి తగిన గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధ సమయాల్లో భారత్ కు కచ్చితంగా అమెరికా సైన్యం సహకరిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా శాంతికి కృషి చేసినందుకు గాను ఈ మేరకు ట్రంప్ ను మోదీ ప్రశంసించారు.

అలాగే ఇటీవల హర్మూజ్ జలసంధిలో భారత జెండా ఉన్న నౌకపై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. నావికుల భద్రత తమకు చాలా కీలకమని తేల్చి చెప్పారు. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానం ఉండేలా చూడాలని మోదీ స్పష్టం చేశారు. ఇక అమెరికా- భారత్ మాధ్య ట్రేడ్ డీల్ త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. మరోవైపు మోదీ- ట్రంప్ దాదాపు 16 నెలల తర్వాత భేటీ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, డిఫెన్స్ తదితర అంశాలపై చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications