భారత్ లో అడుగుపెట్టను.. ట్రంప్ సంచలన నిర్ణయం..!
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలను రష్యా పట్టించుకోలేదు. అంతేకాక ఉక్రెయిన్ పై దాడులను మరింత తీవ్రతరం చేసింది రష్యా . దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని భావించిన ట్రంప్.. భారత్ పై పడ్డారు. రష్యా నుంచి అధిక మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. భారత్ వస్తువులపై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో భారత్- అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
#Breaking #Trump cancels Quad Summit visit to #India, citing trade tensions. U.S.-India relations strain as tariffs loom. The 2025 summit, hosted by India, faces uncertainty. Geopolitical analysts warn of weakened Quad cohesion against China. #QuadSummit #USIndiaRelations pic.twitter.com/OC6GEaOXcC
— Thepagetoday (@thepagetody) August 30, 2025
అమెరికా టారిఫ్ లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగానే స్పందించారు. ఎంత ఒత్తిడినైనా తట్టుకుంటాం కానీ అమెరికాకు తలొగ్గే పరిస్థితి మాత్రం లేదని తేల్చి చెప్పారు. భారత్ లోని రైతులు, పశు పోషకులు, చిన్న మధ్య తరగతి కార్మికులకు నష్టం కలిగించే విధంగా తమ ప్రభుత్వం ఎప్పటికీ నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. అలాగే ఇతర దేశాలపై ఆధార పడకుండా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భరతకు భారత్ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ వేదికగా జరిగే క్వాడ్ సమావేశానికి తాను హాజరు కావడం లేదంటూ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక స్పష్టం చేసింది. ఈ ఏడాది భారత్ లో 7వ క్వాడ్ సమ్మిట్ జరగనుంది. మొదట ఈ సమావేశానికి వచ్చేందుకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు. కానీ పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజులపాటు ఈ ఆపరేషన్ జరిగింది. అయితే భారత్- పాకిస్థాన్ మధ్య తానే యుద్ధం ఆపేసినట్లు ట్రంప్ ప్రపంచ దేశాలకు చెప్పుకొచ్చారు. యుద్ధం తనవల్లే ఆగిపోయిందని తెలిపారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఇందులో ఇతర దేశాల ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. దీంతో భారత్ పై ట్రంప్ అసహనంతో ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
ప్రస్తుతం భారత్- అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అయితే ఈ విషయంపై అటు అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం ఇటు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో ఉన్నారు. జపాన్ లో పర్యటన అనంతరం ఆయన చైనా చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాంజిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO)లో పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో చైనాలో జరగనున్న SCO సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో అమెరికా వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించనున్నాయి. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి.












Click it and Unblock the Notifications