అర్ధరాత్రి అమెరికా పార్లమెంట్ ఊహించని ట్విస్ట్.. ట్రంప్ పవర్స్ కట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు అక్కడి పార్లమెంట్ (ప్రతినిధుల సభ) గట్టి బ్రేకులు వేసింది. ఇరాన్‌తో ముదురుతున్న వివాదంపై కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) అధికారికంగా ఆమోదం తెలిపే వరకు సైనిక చర్యలను పూర్తిగా నిలిపివేయాలని కోరుతూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన 'వార్ పవర్స్ రెజల్యూషన్’ (యుద్ధ అధికారాల తీర్మానం) దిగువ సభలో పాస్ అయింది. అధ్యక్షుడి ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేలా సాగిన ఈ ఓటింగ్.. శ్వేతసౌధం (వైట్ హౌస్) ఆశయాలకు తీవ్ర ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.
సొంత పార్టీ వారే షాక్ ఇచ్చారు!
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'సీఎన్‌ఎన్’ నివేదిక ప్రకారం.. ఈ కీలక తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 208 ఓట్లు పడ్డాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ట్రంప్ సొంత పార్టీ (రిపబ్లికన్) కి చెందిన నలుగురు ప్రతినిధులు థామస్ మాస్సీ, బ్రయాన్ ఫిట్జ్‌పాట్రిక్, టామ్ బారెట్, వారెన్ డేవిడ్‌సన్‌లు పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ డెమొక్రాట్లతో చేతులు కలిపారు. అధ్యక్షుడి మిలిటరీ అధికారాలను కట్టడి చేయాలనే డెమొక్రాట్ల పోరాటానికి రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు పెరుగుతుండటం అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సరికొత్త వివాదం: 'ఆయుధ వ్యతిరేక నిధి'
పార్లమెంట్‌లో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఘర్షణ ఎంతలా పెరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ హిల్ దాడుల మద్దతుదారులకు నిధులు అందుతాయనే ఆందోళనతో.. ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న 1.8 బిలియన్ డాలర్ల వివాదాస్పద "ఆయుధ వ్యతిరేక నిధి"ని సెనేట్ రిపబ్లికన్లు సైతం వ్యతిరేకించారు. అలాగే ట్రంప్ బాల్రూమ్ భద్రతా నిధులను కూడా నిబంధనల ఉల్లంఘన పేరిట రద్దు చేశారు.
రాజ్యాంగ రక్షణే మా బాధ్యత
ఈ చట్టాన్ని ప్రతిపాదించిన న్యూయార్క్ డెమొక్రాట్ నేత గ్రెగొరీ మీక్స్ ఓటింగ్ అనంతరం హర్షం వ్యక్తం చేశారు. "రిపబ్లికన్ సభ్యులు కూడా మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా రాజ్యాంగ బాధ్యతలను మేము నెరవేరుస్తున్నాం. ప్రభుత్వం రాజ్యాంగాన్ని దాటి ప్రవర్తించినప్పుడు చెక్ పెట్టడం మా పని" అని ఆయన అన్నారు. నిజానికి మే 21నే జరగాల్సిన ఈ ఓటింగ్‌ను, ఓటమి భయంతో హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని మీక్స్ ఆరోపించారు.
స్పీకర్ మైక్ జాన్సన్ వాదన ఏంటి?
మరోవైపు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఈ ఆంక్షలను తీవ్రంగా తప్పుపట్టారు. అధ్యక్షుడి దౌత్య అధికారాలను కట్టడి చేయడం వల్ల అంతర్జాతీయంగా అమెరికా బేరసారాల శక్తి బలహీనపడుతుందని ఆయన హెచ్చరించారు. "ఇరాన్‌లో మన సైనిక లక్ష్యాలు నెరవేరాయి. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ముగిసింది. అధ్యక్షుడు ఇప్పుడు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే పనిలో ఉన్నారు, దానికి ఆయనకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు ఇలాంటి తీర్మానాలు చేయడం దేశానికే ప్రమాదకరం" అని ఆయన వ్యాఖ్యానించారు.
తెరపైకి చట్టపరమైన చిక్కులు.. '60 రోజుల రూల్’!
ఈ రాజకీయ రచ్చ ఇలా ఉండగానే.. పెంటగాన్, విదేశాంగ శాఖల ఇన్‌స్పెక్టర్ జనరల్స్ రంగంలోకి దిగి ఈ సైనిక చర్యలపై ఉమ్మడి చట్టబద్ధమైన దర్యాప్తును ప్రారంభించారు. అమెరికా చట్టాల ప్రకారం.. పార్లమెంట్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏ విదేశీ భూభాగంలోనైనా కేవలం 60 రోజులు మాత్రమే సాయుధ బలగాలను ఉంచగలరు.
'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'కి వైట్ హౌస్ ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఇప్పటికే 60 రోజుల పరిమితి దాటిందని పర్యవేక్షక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఏప్రిల్‌లో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినప్పుడే ఆ 60 రోజుల గడువు మళ్లీ మొదటికొచ్చిందని (రీసెట్ అయిందని) డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ వాదిస్తున్నారు. ఈ చట్టపరమైన చిక్కుముడి ఎటు దారితీస్తుందో చూడాలి!













Click it and Unblock the Notifications