H1B Fee vs HIRE Act: హెచ్1బీ వీసా కష్టాల్ని హైర్ చట్టం తీర్చనుందా ? ఓ విశ్లేషణ..!
ఇల్లినాయిస్ ప్రతినిధి రాజా కృష్ణమూర్తి HIRE చట్టాన్ని పునఃప్రవేశపెట్టారు, U.S. లో నైపుణ్యంతో కూడిన కార్మికుల కొరతను పరిష్కరించడానికి H-1B వీసా కోటాలను రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయులు సహా విదేశీయుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచే లక్ష్యంతో కొత్త హెచ్1బీ వీసాలకు ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు విధించారు. అయినా కంపెనీలు అమెరికన్లకు భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో మొత్తం హెచ్ 1బీ వీసా విధానంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైర్ చట్టం తెరపైకి వచ్చింది.
అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు ఇచ్చే హెచ్1బీ (H-1B) వీసాల సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఇల్లినాయిస్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రతినిధి రాజా కృష్ణమూర్తి 'హై-స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ రీఫామ్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ (HIRE) చట్టాన్ని' కాంగ్రెస్‌లో తిరిగి ప్రవేశపెట్టారు. అమెరికా దీర్ఘకాలిక ఆర్థిక, సాంకేతిక పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేశారు. ముఖ్యంగా కార్మిక కొరత ఎదుర్కొంటున్న రంగాల్లో ఇది కీలకంగా కనిపిస్తోంది.

ట్రంప్ ప్రభుత్వంలో హెచ్1బీ వీసాలపై కఠినమైన నిబంధనలు, పెరిగిన దరఖాస్తు రుసుములతో హైర్ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది. టెక్నాలజీ, హెల్త్‌కేర్, పరిశోధన పరిశ్రమలలో విదేశీ ప్రతిభపై ఆధారపడే వ్యాపారాలు ట్రంప్ విధానాలపై ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హైర్ చట్టంపై అమెరికా, భారత్ తో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ హైర్ చట్టం ఏంటో ఓసారి చూద్దాం..
కొన్ని ప్రత్యేక రంగాల్లో కార్మికుల కొరత తీర్చేందుకు కాంగ్రెస్ లో డెమోక్రాట్ కృష్ణమూర్తి వార్షిక హెచ్1బీ వీసాల పరిమితిని 65వేల నుంచి లక్షా 30 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. అమెరికన్ ఉన్నత డిగ్రీలు ఉన్న దరఖాస్తుదారుల కోసం అదనంగా మరో 20 వేల వీసాలు కేటాయించాలని కూడా ఆయన కోరారు. ఈ చర్య కీలక పరిశ్రమలలో నియామక ప్రక్రియలను గణనీయంగా మార్చగలదని భావిస్తున్నారు. అలాగే దేశీయ ఉద్యోగ అవకాశాలను కాపాడుకుంటూ అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించే అవసరాన్ని బ్యాలెన్స్ చేయనుంది. దీంతో భారతీయులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

గత సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్1బీ కార్మికుల పర్మిట్ల ఫీజును కంపెనీలకు లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను నియమించుకోవాలని చూస్తున్న అమెరికా కంపెనీలకు ఈ ఫీజు గణనీయంగా ఖర్చు పెంచుతోంది. అదే సమయంలో తాజాగా వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ను కాల్చి చంపిన ఘటన తర్వాత మూడో ప్రపంచ దేశాలకు శాశ్వతంగా వీసాలు జారీ చేయకుండా చేయాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైర్ చట్టం ప్రతిపాదన వచ్చింది. ఇందులో హెచ్1బీ వీసాల పరిమితిని పెంచడం ద్వారా టెక్నాలజీ, ఇతర ప్రత్యేక రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను ఈ చట్టం ద్వారా తీర్చాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications