భారత్ స్క్రూలు ఇంకా టైట్ చేయనున్న ట్రంప్
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఇప్పుడు తాజాగా మరో ప్రకటన చేశారు. భారత్ పై సెకెండరీ శాంక్షన్స్ విధించనున్నట్లు తెలిపారు. రష్యా నుంచి క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మున్ముందు మరిన్ని చర్యలు ఉంటాయనీ హెచ్చరించారు. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నావ్‌రోకీతో ఓవల్ ఆఫీసులో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలెండ్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. భారత్ కు విధించిన టారిఫ్, ఇతర ఆంక్షల వల్ల రష్యాకు వందల బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఫేజ్-2, ఫేజ్-3 ఆంక్షలు ఇంకా అమలులోకి రాలేదని పేర్కొన్నారు. రష్యాపై చర్యలు తీసుకోలేదని ఎవరు చెప్పారని ఆ రిపోర్టర్ కు ఎదురు ప్రశ్న వేశారు.
చైనా తర్వాత అతిపెద్ద కొనుగోలుదారు అయిన భారత్ పై సెకెండరీ శాంక్షన్స్ విధించడాన్ని రష్యాపై తీసుకున్న చర్యలు కాదని అంటారా?" అని ట్రంప్ ఎదురుదాడికి దిగారు. రష్యాకు వందల బిలియన్ల డాలర్లు నష్టం వాటిల్లేలా చేశానని అన్నారు. ఇంకా ఫేజ్-2 లేదా ఫేజ్- 3 శాంక్షన్స్ ఇంకా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇవన్నీ కూడా రష్యాకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు కావు అని భావిస్తోంటే మీరు కొత్త ఉద్యోగం వెతుక్కోక తప్పదు అని ఆ రిపోర్టర్ ను హెచ్చరించారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ ను స్పష్టంగా హెచ్చరించానని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తే భారీ సమస్యలు వస్తాయని రెండు వారాల కిందట భారత్ ను హెచ్చరించానని, ఇప్పుడు అదే జరుగుతుందని తేల్చి చెప్పారు. భారత్‌పై 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్ విధించామని, రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటోన్నందున దాన్ని 50 శాతానికి పెంచామనీ వివరించారు.
చైనా విక్టరీ డే పరేడ్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొనడంపైనా స్పందించారు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశం నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్, సెకెండరీ శాంక్షన్స్ విధించడం వల్ల రష్యా ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిందని పునరుద్ఘాటించారు. ఇందులో భారత్ కూడా ఉందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications