వెనీజులా గగనతలం మూసివేత.. యుద్ధం దిశగా ట్రంప్..?
డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో వెనీజులాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరీబియన్ సముద్రం గుండా అక్రమంగా డ్రగ్స్ ను తరలిస్తున్న పడవలు, జలాంతర్గాములపై అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. కరేబియన్ సముద్రంలో భారీగా అమెరికా బలగాలను మోహరించింది. సముద్ర మార్గంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నామన్న కారణంగా నేరుగా వెనీజులా భూభాగంపైనే చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఇటీవల వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ దేశానికి సంబంధించి మరో సంచలన ప్రకటన చేశారు ట్రంప్.
మాదకద్రవ్యాల అక్రమరవాణా విషయంలో వెనీజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనీజులా గగనతలం మూసివేస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. "అన్ని ఎయిర్ లైన్స్, పైలట్స్ , డ్రగ్ డీలర్స్, మానవ అక్రమ రవాణాదారులుకు నా విజ్ఞప్తి. వెనుజులా భూభాగం, అలాగే సరిహద్దులోని గగనతలం మూసివేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గ్రహించినందుకు కృతజ్ఞతలు" అని ట్రంప్ పోస్టు పెట్టారు. దీంతో వెనీజులా భూభాగంపై అమెరికా దాడులకు సిద్ధం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా.. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్‌లతో కూడిన సైనిక బలగాలను భారీగా మోహరించింది. అలాగే ఇటీవల డ్రగ్ మాఫియాపై అమెరికా జరిపిన దాడుల్లో సుమారు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు వెనీజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు.. డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నట్లు ట్రంప్ సర్కార్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే మదురో సర్కార్.. రోజులు లెక్కబెట్టుకోవాలని ఇటీవల ట్రంప్ కీలక ప్రకటన చేయడంతో ఆందోళన వ్యక్తం అయింది. అయితే తాజాగా వెనీజులాపై ట్రంప్ మరో బాంబ్ పేల్చిన నేపథ్యంలో ఇక అమెరికా బలగాలు వెనీజులాపై దండెత్తే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వెనీజులాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.












Click it and Unblock the Notifications