అలా చేస్తే ఇరాన్ లోని ప్లాంట్ లు, బ్రిడ్జ్ లను పేల్చేస్తాం: ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
వాణిజ్య నౌకలపై జరిగే ఒక్కో దాడికి ప్రతీకారంగా ఇరాన్ లోని ఒక్కో న్యూక్లియర్ ప్లాంట్, బ్రిడ్జ్ లను ధ్వంసం చేస్తామని సంచలన వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలోని నౌకలపై క్షిపణి, రాకెట్, డ్రోన్ లేదా ఇతర ఆయుధ దాడులు చేసినా ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్ లోని పౌరుల మౌలిక వసతులపై దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇరు దేశాల మధ్య తాజాగా దాడులు తీవ్రతరం కావడంతో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకుముందు కూడా ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ ను ఇప్పట్లో వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ లోని నటాంజ్ న్యూక్లియర్ కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్సే పర్వతం పై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద దాదాపు వేయి పౌండ్ల రిఫైన్డ్ యూరేనియం నిల్వలు ఉన్నాయని.. ఇరాన్ మరోసారి అణ్వాయుధాలను తయారు చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఇరాన్ వద్ద భారీ స్థాయిలో ఉన్న యూరేనియంను స్వాధీనం చేసేందుకు త్వరలోనే మిలిటరీ యాక్షన్ చేపడతామని స్పష్టం చేశారు.

ఇక కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను వేగవంతం చేసింది. అటు అమెరికా సైతం 11 రోజులుగా ఇరాన్ లోని కీలక ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దాంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చినట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ను ఇప్పటికే పాతికేళ్ల వెనక్కు నెట్టేశామని అన్నారు. తాము ఇరాన్ అంతు చూసేవరకూ వెనకడుగు వేయమని తెలిపారు.












Click it and Unblock the Notifications