భారతీయులకు శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్- మళ్లీ..!!
దీపావళి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులక శుభాకాంక్షలను తెలియజేశారు. పండుగ విశేషాల గురించి ప్రస్తావించారు. చీకటిని పారద్రోలే దీపాలను వెలిగించే పర్వదినంగా అభివర్ణించారు. ఆయనతో పాటు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పండుగ శుభాకాంక్షలన తెలియజేస్తూ ట్వీట్లు పోస్ట్ చేశారు. భారతీయులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, ఇంగ్లాండ్, కెనడా ప్రధానమంత్రులు బెంజమిన్ నెతన్యాహు, కీర్ స్టార్మర్, మార్క్ కార్నీ భారతీయులకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని అరబ్ దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. భారత్ లోని తమ రాయబార, హైకమిషనర్ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించిన, అక్కడి ఉద్యోగులు బాణాసంచాను కాల్చుతున్న ఫొటోలను తమ ట్వీట్లకు జత చేశారు.

అమెరికా, భారత సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తోన్న భారతీయులందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సకుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో కలిసి ఈ పండుగ జరుపుకోవడం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనే సత్యాన్ని భారతీయులు విశ్వసిస్తారనడానికి ఈ పండుగ ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వెలుగులను ప్రసాదించే దీపాలను లక్షలాదిమంది ఒకేసారి వెలిగించే అరుదైన పండుగగా అభివరణించారాయన.
సమాజ శ్రేయస్సును కోరుకునే దీపావళిని జరుపుకొంటోన్న ప్రతి అమెరికన్‌కూ దీనిద్వారా ఓ గొప్ప మానసిక ప్రశాంతతను లభిస్తుందని నమ్ముతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. వారికి ఈ పండుగ ప్రశాంతత, శ్రేయస్సు, ఆశ, శాంతిని అందించాలని కోరుకుంటోన్నానని అన్నారు. ఈ పండుగ అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్, భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా దీపాల పండుగను జరుపుకుందామని, చెడుపై మంచి ఎప్పటికీ విజయం సాధిస్తుందని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. వాషింగ్టన్ ఇండియా హౌస్‌లో జరిగిన వేడుకల్లో వైట్ హౌస్ ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్, అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వత్రా పాల్గొన్నారు.
బెంజమిన్ నెతన్యాహు దీపావళి విషెస్ తెలిపారు. భారతీయులకు సంఘీభావాన్ని తెలియజేస్తోన్నామని, వారితో గల స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటోన్నామని నెతన్యాహూ చెప్పారు. భారతీయ సమాజంతో కలిసి దీపావళి వేడుకల్లో పాలుపంచుకున్నామని అన్నారు. తన మిత్రుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. దీపాల పండుగ ప్రతి భారతీయుడిలో ఆశ, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications