రష్యాకు భారీ నష్టం : 12 వేల మంది సైనికులు మృతి.. యుద్ధ ట్యాంకులు, విమానాలు ద్వంసం !!
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణలు ఆగడంలేదు. ప్రధాన నగరాలపై దాడులకు దిగుతూ వాటిని ఆక్రమించుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సుమీ, సెవరోదొనెస్కలో రష్యా సేనలు కాల్పులకు దిగాయి. ఈ దాడుల్లో సుమారు 32 మంది మృతి చెందారు. రష్యా యుద్ధ చర్యలతో ఉక్రెయిన్‌కు భారీగానే ప్రాణ నష్టం, ఆస్థినష్టం సంభవించింది. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు రష్యా దళాలు దాడులకు దిగుతున్నాయి. అయినా తమ శక్తి వంచన లేకుండా ఉక్రెయిన్ సేనలు, పౌరులు దీటుగా ఎదుర్కొంటున్నారు. రష్యా సేనలను మట్టుబెడుతున్నారు. యుద్ధ ట్యాంకర్లను, విమానాలను ద్వంసం చేస్తున్నారు.
Recommended Video

12 వేల మంది రష్యా సైనికులు హతం
ఈయుద్ధంలో రష్యా పెద్ద ఎత్తున తమ సైనికులును నష్టపోతోందని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా బలగాలను తీవ్రంగా తమ సేనలు ప్రతిఘటిస్తున్నాయని చెప్పింది. ఈ ప్రతిఘటనలో 12 వేలమంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ వెల్లడించింది. ఒక వైపు కాల్పుల విరమణ ప్రకటించి మరొవైపు దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. గురువారం ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కానున్నారు. రష్యా దురాక్రమణలను ఆపాలని కోరుతోంది..

యుద్ధ విమానాలు, ట్యాంకర్లు ధ్వంసం
గత 14 రోజులుగా రష్యా సేనలపై విరోచితంగా తమ సైనికులు పోరాటం చేస్తున్నాయని ఉక్రెయిన్ పేర్కొంది. తమ దేశం కోసం పోరాటంలో వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ భీకర పోరులో రష్యాకు చెందిన 12వేల మంది సైనికులు మృతి చెందినట్లు తెలిపింది . రష్యాకు చెందిన 303 యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నలు, 80 హెలికాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులు, 48 యుద్ధ విమానాలు, 27 యాంటీ-ఎయిర్ క్రాప్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.

మరోసారి కాల్పుల విరమణ
అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ చెబుతున్న వివరాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. కావాలనే తప్పుడు లెక్కలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 498 మంది మాత్రమే తమ సైనికులు మరణించినట్లు రష్యా చెప్పుకోస్తోంది. ఇదిలా ఉండలా ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో రష్యా మరోసారి కాల్పుల విరమణను ప్రకటించింది. పౌరుల తరలింపు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, చెర్నిహెవ్, సుమీ, ఖార్కివ్, మరియుపోల్‌లో ఈ కాల్పులను విరమణ ఉంటుందని తెలిపింది.












Click it and Unblock the Notifications